న్యూఢిల్లీ: భారత సంతతి వ్యక్తి, 22 ఏళ్ల మజోతి సాహిల్ మొహమ్మద్ హుస్సేన్‌ను ఉక్రెయిన్ దళాలు అరెస్టు చేశారు. గుజరాత్‌లోని మోర్బీకి చెందిన ఆ వ్యక్తి.. రష్యా ఆర్మీకి విధులు నిర్వహిస్తున్నట్లు ఉక్రెయిన్ ఆరోపించింది. అయితే సాహిల్ అరెస్టు విషయంలో భారతీయ అధికారులు ఇప్పటి వరకు ఎటువంటి ప్రకటన చేయలేదు. ఉక్రెయిన్‌లోని మీడియా సంస్థ ద కీవ్ ఇండిపెండెంట్ ప్రకారం.. తొలుత చదువు కోసం హుస్సేన్ రష్యాకు వెళ్లాడని, ఆ తర్వాత అతన్ని రష్యా ఆర్మీలో చేర్చుకున్నారని తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు చెందిన 63వ మెకనైజ్డ్ బ్రిగేడ్ ఓ వీడియో రిలీజ్ చేశారు. రష్యాలో డ్రగ్ సంబంధిత నేరంలో దొరికిన హుస్సేన్ ఏడేళ్ల జైలుశిక్ష అనుభవిస్తున్నాడని ఆ బ్రిగేడ్ పేర్కొన్నారు. జైలులో ఉన్న సమయంలో రష్యన్ ఆర్మీలో చేరాలని హుస్సేన్‌తో కాంట్రాక్టు కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం చేస్తున్న రష్యా స్పెషల్ మిలిటరీ ఆపరేషన్ కోసం సైనికుల్ని రిక్రూట్ చేస్తున్నది. అయితే జైలుశిక్షకు బదులుగా రష్యాలో ఆర్మీలో పనిచేసేందుకు హుస్సేన్ ఒప్పందం కుదుర్చుకున్నట్లు తెలుస్తోంది.
అక్టోబర్ ఒకటో తేదీన హుస్సేన్‌ను ఫ్రంట్‌లైన్‌కు పంపారు. అయితే దానికి ముందు అతను కేవలం 16 రోజులు మాత్రమే మిలిటరీ శిక్షణ తీసుకున్నాడు. అయితే ఉక్రెయిన్ దళాలకు స్వచ్ఛందంగా లొంగిపోయినట్లు హుస్సేన్ చెప్పాడు. 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉక్రెయిన్ స్థావరాన్ని చూసిన తర్వాత ఆయుధాన్ని వదిలేసినట్లు చెప్పాడు. తనకు ఫైట్ చేయాలని లేదని, సహాయం చేయాలని వాళ్లను కోరినట్లు చెప్పాడు. రష్యన్ ఆర్మీ పనిచేస్తే డబ్బులు ఇస్తారని పేర్కొన్నా, ఇప్పటి వరకు చిల్లిగవ్వ దక్కలేదన్నాడు. రష్యాకు వెళ్లాలని లేదని, అక్కడ నిజం లేదని, ఉక్రెయిన్‌లోనే జైలులో ఉంటానని అన్నాడు.