కోహిమా: నాగాలాండ్ అసెంబ్లీలో ప్రతిపక్షం అనేదే లేకుండా పోయింది. ఏకంగా ప్రతిపక్ష నేతే తన మద్దుతుదారులతో కలిసి అధికార కూటమిలో చేరారు. రాష్ట్రంలో మరో ఏడాదిలో ఎన్నికలు జరుగునున్న నేపథ్యంలో ఈ విలీనం జరగడం విశేషం.
ప్రతిపక్ష నాగా పీపుల్స్ ఫ్రంట్‌కు (ఎన్పీఎఫ్) చెందిన 21 మంది ఎమ్మెల్యేలు అధికార పార్టీలో విలీనమయ్యారు. ప్రతిపక్ష నేత టీఆర్ జెలియంగ్ నేతృత్వంలో ఎన్పీఎఫ్కు చెందిన 20 మంది (ఆయనతో కలిపి 21 మంది) సీఎం నెయిఫియు రియోకు చెందిన నేషనలిస్ట్ డెమోక్రటిక్ ప్రొగ్రెసివ్ పార్టీలో (ఎన్డీపీపీ) చేరారు. దీనికి అసెంబ్లీ స్పీకర్ ఆమోదం కూడా తెలిపారు. దీంతో విపక్ష ఎన్పీఎఫ్లో నలుగురు ఎమ్మెల్యేలు మాత్రమే మిగిలారు.
నాగాలాండ్ అసెంబ్లీలో మొత్తం 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 2018లో జరిగిన ఎన్నికల్లో ఏ పార్టీకి స్పష్టమైన మెజారిటీ రాలేదు. ఈ ఎన్నికల్లో 18 స్థానాలు గెలుపొందిన ఎన్డీపీపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఎన్పీఎఫ్ 25 స్థానాలు, బీజేపీ 12, ఎన్పీపీ 2, జేడీయూ 1, ఇండిపెండెంట్ గెలుపొందారు. అయితే ఎడీపీపీకి బీజేపీ, ఎన్పీపీ, జేడీయూ, ఇండిపెండెంట్ మద్దతు తెలిపాయి. దీంతో సీఎం నెయిఫియూ రియో నేతృత్వంలో బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.