Maoist Surrender | మావోయిస్టు పార్టీకి ఎదురుదెబ్బ తగులుతున్నది. ఇటీవల పెద్ద ఎత్తున మావోయిస్టులు లొంగిపోతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో 21 మంది మావోలు పోలీసుల ఎదుట లొంగిపోయారు. బస్తర్ రేంజ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లొంగిపోయిన మావోయిస్టులు కేశ్కాల్ డివిజన్ కుమారి, కిస్కోడా ఏరియా కమిటీ మావోయిస్టులని.. లొంగిపోయిన వారిలో కేశ్కాల్ డివిజన్ కమిటీ కార్యదర్శి ముకేష్, నలుగురు డీవీసీఎంలు (డివిజన్ వైస్ కమిటీ సభ్యులు, తొమ్మిది మంది ఏఎంసీ (ఏరియా కమిటీ సభ్యులు)లతో పాటు ఎనిమిది మంది పార్టీ సభ్యులు ఉన్నారని పోలీసు అధికారులు తెలిపారు. బస్తర్రేంజ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పీ సుందర్రాజ్ మాట్లాడుతూ.. మావోయిస్టులు తాము అనుసరిస్తున్న మార్గం వ్యర్థమని భావించి.. వారి జీవితాలను పునర్నిర్మించుకునేందుకు జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని ఎంచుకున్నారన్నారు. ఆయుధాలను విడిచిపెట్టిన 21 మందిలో 13 మంది మహిళలు, ఎనిమిది మంది పురుషులు ఉన్నారన్నారు. వారంతా సాయుధ పోరాటాన్ని వీడి శాంతి, పురోగతి మార్గంలో వెళ్లాలనుకుంటున్నారని పోలీస్ అధికారి పేర్కొన్నారు.
లొంగుబాటు సమయంలో మావోయిస్టులు 18 ఆయుధాలను అప్పగించారు. ఇందులో మూడు ఒకే 47 రైఫిల్స్, నాలుగు ఎస్ఎల్ఆర్లు, రెండు ఇన్సాస్ రైఫిల్స్, ఆరు 303 రైఫిల్స్, రెండు సింగిల్ షాట్ రైఫిల్స్, ఓ బీజీఎల్ (బారెల్ గ్రెనేడ్ లాంచర్) ఉన్నాయి. చట్టప్రకారం పునరావసం కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. లొంగుబాటు, పునరావాసానికి సంబంధించిన వివరాలన్నీ త్వరలోనే వివరిస్తామని ఐజీ సుందర్రాజ్ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల పెద్ద సంఖ్యలో మావోయిస్టులు అడవి మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. అక్టోబర్ మూడో వారంలో దాదాపు 238 మంది మావోయిస్టులు లొంగిపోచారు. 17న బస్తర్ జిల్లా ప్రధాన కార్యాలయం జగదల్పూర్లో అధికారుల ముందు లొంగిపోయిన కేంద్ర కమిటీ (CC) సభ్యుడితో సహా దాదాపు 210 మంది మావోయిస్టులు లొంగిపోయిన విషయం తెలిసింది. రూ.9.18 కోట్ల రివార్డును ప్రకటించారు. లొంగిపోయిన సీనియర్ నేతల్లో కేంద్ర కమిటీ సభ్యుడు రూపేష్ అలియాస్ సతీశ్, భాస్కర్ అలియాస్ రాజ్మన్ మాండవి, రాణిత, రాజు సలాం, ధన్ను వెట్టి, అలియాస్ సంతు, నలుగురు సభ్యులు దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ, ప్రాంతీయ కమిటీ సభ్యుడు రతన్ ఎలామ్ ఉన్నారు.