భోపాల్: పోలింగ్ డ్యూటీలో పాల్గొన్న పోలీసులు ప్రయాణించిన బస్సు బోల్తా పడింది. (Bus Overturns) ఈ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. వీరిలో 8 మంది పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యప్రదేశ్‌లోని బేతుల్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. ఐదుగురు పోలీసులు, 35 మంది హోంగార్డులతో సహా మొత్తం 40 మంది పోలీస్ సిబ్బంది శుక్రవారం చింద్వారాలో పోలింగ్ డ్యూటీలో పాల్గొన్నారు. ఎన్నికల డ్యూటీ ముగిసిన తర్వాత బస్సులో రాజ్‌గఢ్‌కు తిరుగు ప్రయాణమయ్యారు.
కాగా, శనివారం తెల్లవారుజామున 4 గంటలకు భోపాల్-బేతుల్ హైవేలోని బరేతా ఘాట్ సమీపంలో లారీని తప్పించే క్రమంలో ఆ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో బస్సులోని 40 మంది పోలీస్ సిబ్బందిలో 21 మంది గాయపడ్డారు. తీవ్ర గాయాలైన ఎనిమిది మంది బెతుల్‌లోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. స్వల్ప గాయాలైన వారికి షాపూర్ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.