Actor Vijay : తమిళనాడు (Tamil Nadu) లో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ డీఎంకే (DMK), టీవీకే (TVK) పార్టీల మధ్యనే ఉంటుందని తమిళ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విజయ్ చెప్పారు. ఇవాళ తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగిన టీవీకే పార్టీ జనరల్ కౌన్సిల్ తొలి సమావేశంలో విజయ్ మాట్లాడారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారం కోసం పోటీలో కూడా ఉండే అవకాశం లేదని ఆయన చెప్పకనే చెప్పారు.
‘2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రధాన పోటీ కేవలం రెండు పార్టీల మధ్యనే ఉంటుంది. అందులో ఒకటి టీవీకే కాగా, రెండోది డీఎంకే. గతంలో ఎన్నడూ లేనివిధంగా తమిళనాడు ఈసారి భిన్నమైన ఎన్నికలను చూడబోతోంది.’ అని టీవీకే చీఫ్ విజయ్ తెలిపారు. ఈ సందర్భంగా అధికార డీఎంకేపైన, సీఎం ఎంకే స్టాలిన్పైన విజయ్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని, మహిళపై నేరాలు పెరుగుతున్నాయని ఆరోపించారు.
‘మీ పరిపాలన గురించి మాట్లాడితే మీకెందుకు అంత కోసం వస్తుంది..? మీరు సరిగా పరిపాలన చేసి ఉంటే మహిళల భద్రత, శాంతిభద్రతలు నియంత్రణలో ఉండేవి. రాష్ట్రంలో మహిళపై జరుగుతున్న అరాచకాల గురించైతే నేనింకా మాట్లాడలేను.’ అని విజయ్ అన్నారు. అదేవిధంగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన అంశంపై కూడా విజయ్ అభ్యంతరం వ్యక్తంచేశారు. నియోజకవర్గాల పునర్విభజన ద్వారా కేంద్రం పార్లమెంటులో తమిళనాడు ప్రాధాన్యం తగ్గించాలని చూస్తోందని ఆరోపించారు.
అదేవిధంగా తమిళనాడుతో జాగ్రత్త అని ప్రధాని నరేంద్రమోదీని విజయ్ హెచ్చరించారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ పేరుతో పార్లమెంటుకు, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించి తమిళనాడులో పాగా వేయాలని ప్రధాని భావిస్తున్నారని ఆరోపించారు. కానీ తమిళనాడును హ్యాండిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. ‘తమిళనాడు రాష్ట్రం తన సత్తా ఏమిటో గతంలో చాలాసార్లు చూపించింది సార్. అందుకే జాగ్రత్తగా ఉండండి సార్.’ అని ప్రధాని మోదీకి విజయ్ సలహా ఇచ్చారు.