న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: దేశవ్యాప్తంగా సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ వంటి ప్రతిష్ఠాత్మకమైన ఉద్యోగాల భర్తీ కోసం ఏటా నిర్వహించే సీఎస్ఈ (సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్), ఐఎఫ్ఎస్(ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ ఎగ్జామ్)-2024 నోటిఫికేషన్లను యూపీఎస్సీ బుధవారం విడుదల చేసింది. ఈ ఏడాది సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను మే 26న, మెయిన్స్‌ను సెప్టెంబర్ 20 నుంచి (ఐదు రోజులు) నిర్వహిస్తామని నోటిఫికేషన్లో పేర్కొన్నది.
ఈ ఏడాది అఖిల భారత సర్వీసుల్లో మొత్తం 1,056 ఉద్యోగాల భర్తీ చేయనున్నట్టు తెలిపింది. ఈ పరీక్ష ద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్, ఐఐఎస్ వంటి 21 రకాల పోస్టులను యూపీఎస్సీ భర్తీ చేయనున్నది. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్-2024 నోటిఫికేషన్ ద్వారా ఈసారి 150 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఫిబ్రవరి 14 నుంచి మొదలైన దరఖాస్తుల స్వీకరణ మార్చి 5 సాయంత్రం 6 గంటలతో ముగుస్తుందని యూపీఎస్సీ పేర్కొన్నది. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.