న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే గత వారం రోజుల నుంచి ఢిల్లీలో ఎక్సైజ్ అధికారులు సుమారు 50 లక్షల ఖరీదైన 20 వేల మద్యం బాటిళ్ల(liquor Bottles)ను సీజ్ చేశారు. సీజ్ చేసిన దాంట్లో 15,376 లీటర్ల దేశీయ, విదేశీ అక్రమ మద్యం ఉన్నది. 1.5 కోట్ల విలువైన 32 వాహనాలను కూడా పట్టుకున్నారు. అక్రమ మద్యం సీజ్ కేసులో ఇప్పటి వరకు 52 కేసులను రిజిస్టర్ చేశారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత సీజ్ చేసిన మొత్తం మద్యంలో 25 శాతం ఎక్సైజ్ శాఖదే ఉన్నది. హర్యానాతో పాటు ఇతర సరిహద్దు రాష్ట్రాల నుంచి వస్తున్న అక్రమ మద్యాన్ని పట్టుకునేందుకు ఎక్సైజ్ ఇంటెలిజెన్స్ బ్యూరో తీవ్రంగా పనిచేస్తున్నది. 70 అసెంబ్లీ స్థానాలు ఉన్న ఢిల్లీలో ఫిబ్రవరి 5వ తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి 8వ తేదీన కౌంటింగ్ నిర్వహించనున్నారు.