Toxic Controversy | కన్నడ స్టార్ నటుడు యశ్ హీరోగా గీతూ మోహన్‌దాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘టాక్సిక్’ చిత్రం ప్రస్తుతం వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమా టీజర్లో అశ్లీలతతో పాటు అభ్యంతరకర సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయంటూ ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నేతలు కర్ణాటక రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఆప్ రాష్ట్ర కార్యదర్శి ఉషా మోహన్ ఈ ఫిర్యాదులో పేర్కొంటూ.. టీజర్‌లోని దృశ్యాలు పిల్లల మానసిక ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపేలా ఉన్నాయని, తక్షణమే ఈ టీజర్‌ను సామాజిక మాధ్యమాల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
అయితే ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణించిన మహిళా కమిషన్. టీజర్‌లోని అభ్యంతరకర దృశ్యాలను క్షుణ్ణంగా పరిశీలించి, తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా సెన్సార్ బోర్డుకు లేఖ రాసింది. అంతేకాకుండా, దీనిపై పూర్తిస్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది.
అయితే ఈ వివాదంపై సెన్సార్ బోర్డు తాజాగా స్పందించింది. యూట్యూబ్ వంటి డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌లలో విడుదలయ్యే కంటెంట్‌కు సెన్సార్ సర్టిఫికేషన్ అవసరం లేదని తెలిపింది. కేవలం థియేటర్లలో ప్రదర్శించే టీజర్లు, సినిమాలకు మాత్రమే సెన్సార్ అనుమతి తప్పనిసరని, ‘టాక్సిక్’ టీజర్ నేరుగా డిజిటల్ మాధ్యమాల్లో రావడంతో అది తమ పరిధిలోకి రాదని వెల్లడించింది. అంతేకాకుండా ఇప్పటివరకు చిత్రబృందం నుంచి ఎలాంటి కంటెంట్ సెన్సార్ కోసం తమ వద్దకు రాలేదని బోర్డు వెల్లడించింది.