న్యూఢిల్లీ, జూలై 29: 35 మంది కర్నల్స్, 42 మంది లెఫ్టినెంట్ బ్రిగేడియర్ స్థాయి అధికారులు, 20 వేల మంది జవాన్లు.. వీరంతా ఒకే గ్రామానికి చెందినవారంటే నమ్మగలరా? అవును. ఇది నిజమే. ఉత్తరప్రదేశ్‌లోని గాజీపూర్‌లో ఉన్న గహ్మర్.. భారత సైన్యంలోకి అత్యధిక మంది సైనికులను పంపిన గ్రామంగా నిలుస్తున్నది. ఇక్కడి యువతకు భారత సైన్యంలో చేరటం తప్ప.. మరో లక్ష్యం లేదు. ఆ గ్రామంలోని 15వేల మందికిపైగా రిటైర్డ్ జవాన్లే వారికి స్ఫూర్తి. ‘కార్గిల్ విజయ్ దివస్’ సందర్భంగా, అత్యధిక సంఖ్యలో జవాన్లను పంపిన గ్రామంగా ‘గహ్మర్’ పేరు మీడియాలో మారుమోగుతున్నది. ప్రస్తుతం ఈ గ్రామానికి చెందిన 5 వేల మంది సైన్యంలో వివిధ స్థాయిల్లో పనిచేస్తున్నారు.. గ్రామాన్ని 22 ప్రాంతాలుగా విడగొట్టి.. ప్రతి ఒక్క ఏరియాకు ఓ జవాన్ పేరు పెట్టారు. ఆర్మీలో ఎంపికయ్యేందుకు, ఊళ్లో ఉన్న యువత అంతా తెల్లవారుజామున 4 గంటలకు మేల్కొని.. కసరత్తు మొదలుపెడతారు. వీరి శిక్షణ కోసం గ్రామంలోని రిటైర్డ్ జవాన్లు 1,600 మీటర్ల రన్నింగ్ ట్రాక్‌ను నిర్మించారు. గొప్ప సైనిక వారసత్వాన్ని కొనసాగిస్తున్నారని ఆ గ్రామస్థులపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.