నౌపడ, జూలై 12: డ్రైవర్ల సమ్మె వల్ల ఒడిశాలో ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించిపోవడంతో ఆ రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వృద్ధులను సైతం ఆ కష్టాలు వెంటాడుతున్నయి. నౌపడ జిల్లా సినాపాలీ బ్లాక్‌లోని సికాబహల్ గ్రామానికి చెందిన మంగళ్బారీ మహారా (95) అనే వృద్ధురాలు యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ తీసుకునేందుకు ఏకంగా 20 కిలోమీటర్ల దూరం నడవాల్సి వచ్చింది. ఇటీవల కుక్క కాటుకు గురైన ఆమె.. చికిత్సలో భాగంగా బుధవారం చివరి యాంటీ-రేబిస్ ఇంజెక్షన్‌ను తీసుకోవాల్సి ఉన్నది.
కానీ, డ్రైవర్ల సమ్మె వల్ల రవాణా సదుపాయాలు లేకపోవడంతో ఆ వృద్ధురాలు తన కుమారుడు గురుదేవ్‌ను వెంటబెట్టుకుని ఓ ఊతకర్ర సాయంతో 10 కి.మీ. దూరంలోని సినాపాలీ కమ్యూనిటీ సెంటర్‌కు నడుచుకుంటూ వెళ్లారు. అక్కడ యాంటీ-రేబిస్ ఇంజెక్షన్ తీసుకున్న తర్వాత మళ్లీ కాలినడకన స్వగ్రామానికి తిరిగి వచ్చారు. దీనిపై సినాపాలీ బీడీవో స్పందిస్తూ.. డ్రైవర్ల సంఘం సమ్మె వల్లే ఆమెకు ఆ దుస్థితి దాపురించిందని తెలిపారు. అయితే ఆమె గురించి తెలిసి ఉంటే సాయం అందించేవారమని డ్రైవర్ల సంఘం అధ్యక్షుడు దుర్గా చరణ్ తెలిపారు.