కోల్‌కతా, అక్టోబర్ 5: పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో శనివారం రాత్రి కురిసిన భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడి 20 మంది మరణించారు. ఈ ఘటన కారణంగా అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం సహా అనేక ప్రధాన ప్రాంతాలతో డార్జిలింగ్‌కు సంబంధాలు తెగిపోయా యి. పోలీసులు, స్థానిక యంత్రాంగం వెంటనే సహాయక చర్యలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం డార్జిలింగ్ని సందర్శించనున్నారు. డార్జిలింగ్‌లో జరిగిన ప్రాణ నష్టంపై తీవ్ర ఆవేదన చెందుతున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. బాధితులకు తగిన సాయం అందచేస్తామని ఎక్స్ వేదికగా ఆయన హామీ ఇచ్చారు. బెంగాల్, సిక్కిం, డార్జిలింగ్, సిలిగురిని కలిపే రహదారులతో సహా అనేక ప్రధాన మార్గాలలో కొండ చరియలు విరిగి పడటం వల్ల అడ్డంకులు ఏర్పడ్డాయి.
దుర్గా పూజ అనంతరం పెద్ద సంఖ్యలో పర్యాటకులు కోల్‌కతా, బెంగాల్‌లోని ఇతర ప్రాంతాల నుంచి డార్జిలింగ్‌కు పయనమవుతారు. రోడ్లకు అడ్డంకులు ఏర్పడడంతో వారు వివిధ ప్రదేశాలలో చిక్కుకుపోయినట్లు తెలుస్తోంది. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించడానికి గూర్ఖాల్యాండ్ ప్రాదేశిక యంత్రాంగం టైగర్ హిల్, రాక్ గార్డెన్తో సహా డార్జిలింగ్‌లోని పర్యాటక ప్రదేశాలన్నీ మూసివేయాలని నిర్ణయించింది. డార్జిలింగ్కి వెళ్లే ముఖ్యమైన రైలు సర్వీసులు కూడా రద్దయ్యాయి. చిక్కుకుపోయిన పర్యాటకులు, స్థానికుల కోసం బెంగాల్ పోలీసులు హాట్‌లైన్ ఏర్పాటు చేశారు. భారీ స్థాయిలో ప్రాణ, ఆస్తి నష్టం జరిగిందని, అధికారుల నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితిని తెలుసుకుంటున్నానని డార్జిలింగ్ ఎంపీ రాజు బిస్తా చెప్పారు.
కాఠ్మాండు: నేపాల్ దేశాన్ని భారీ వర్షాలు ముంచెత్తాయి. దీని కారణంగా అనేక ప్రాంతాల్లో వరదలు సంభవించడంతో పాటు కొండచరియలు విరిగి పడ్డ ఘటనల్లో ఆదివారం నాటికి 51 మంది మృతి చెందారు. గత రెండు రోజులుగా భారీ వానలు కురుస్తుండటంతో ఇలాం జిల్లా కోశి ప్రాంతంలో కొండ చరియలు విరిగిపడి 37 మంది మృతి చెందారని ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ అధికార ప్రతినిధి కాళిదాస్ దౌబాజీ తెలిపారు. లాంగాంగ్ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లిన నలుగురు గల్లంతయ్యారన్నారు.