చెన్నై: సీఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లో అమ్మోనియా గ్యాస్ లీక్ అయ్యింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో 50 మందికిపైగా అస్వస్థత చెందారు. వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. (ammonia gas leak) తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పెరియపాలయం సమీపంలోని కన్నిగైపైర్‌లో ఉన్న సెయింట్ పీటర్స్ అండ్ పాల్ సీఫుడ్స్ ఎక్స్‌పోర్ట్స్ కేంద్రంలో ఆదివారం అమ్మోనియా గ్యాస్ లీక్ అయ్యింది.
కాగా, ఈ సంఘటన వల్ల అందులో పని చేస్తున్న కార్మికుల్లో ఇద్దరు మరణించారు. సుమారు 46 మంది వాంతులు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. వారిని వెంటనే అంబులెన్స్‌లలో ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
మరోవైపు కొందరు కార్మికుల పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తున్నది. ఏడుగురికి వెంటిలేటర్‌పై చికిత్స అందిస్తున్నట్లు సమాచారం. బాధిత కార్మికుల్లో చాలా మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారేనని పోలీస్ అధికారి తెలిపారు. సీఎం విజయ్ ఈ సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు.