Lok Sabha | న్యూఢిల్లీ : 2024 సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఇక 18వ లోక్‌సభ కొలువుదీరడం ఒక్కటే మిగిలిపోయింది. అయితే ఈ ఎన్నికల్లో ఓ ఇద్దరు అభ్యర్థులు జైల్లో ఉండే గెలుపొందారు. ఆ ఇద్దరు కూడా స్వతంత్ర అభ్యర్థులే. ఒకరు బారాముల్లా నియోజకవర్గం నుంచి, మరొకరు పంజాబ్‌లోని ఖదూర్ సాహిబ్ స్థానం నుంచి విజయం సాధించారు. అయితే ఈ ఇద్దరు అభ్యర్థులు ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. మరి వీరు లోక్‌సభకు వచ్చి ప్రమాణం చేయొచ్చా..? లేదా..? అనే సందేహం ప్రతి ఒక్కరిలో ఉంది. ఈ ఇద్దరి విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయో చూద్దాం.
బారాముల్లా, ఖదూర్ సాహిబ్ నుంచి గెలుపొందిన అబ్దుల్ రషీద్, అమృత్ పాల్.. రాజ్యాంగ నిబంధనల ప్రకారం లోక్‌సభకు వెళ్లి ప్రమాణం చేసేందుకు అర్హులేనని లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్, రాజ్యాంగ నిపుణులు పీడీటీ ఆచారి స్పష్టం చేశారు. ఎన్నికల్లో గెలిచిన వ్యక్తి చట్ట సభ్యుడిగా ప్రమాణం చేయడం అనేది రాజ్యాంగపరమైన హక్కు. ప్రస్తుతం వీరిద్దరూ జైల్లో ఉన్నందున ప్రమాణస్వీకారం కోసం పార్లమెంట్‌కు తీసుకెళ్లేందుకు అధికారుల నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. ప్రమాణస్వీకారం పూర్తయిన తర్వాత తిరిగి జైలుకు తరలించొచ్చు అని ఆచారి పేర్కొన్నారు.
మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. జైల్లో శిక్ష అనుభవిస్తున్న వ్యక్తులు సభా కార్యకలాపాలకు హాజరయ్యేందుకు చట్టం అనుమతించదు. కాబట్టి ఎంపీగా ప్రమాణం చేసిన తర్వాత వారు సభకు హాజరు కాలేకపోవడంపై స్పీకర్‌కు లేఖ రాయాల్సి ఉంటుంది. వారి అభ్యర్థనలను స్పీకర్ సభ్యుల గైర్హాజరీపై ఏర్పాటైన హౌస్ కమిటీకి నివేదిస్తారు. ఈ అభ్యర్థులను అంగీకరించాలా..? వద్దా..? అన్నదానిపై కమిటీ సిఫార్సులు చేసింది. వాటిపై సభలో ఓటింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందని ఆచారి తెలిపారు.
అమృత్ పాల్ జాతీయ భద్రతా చట్టం కింద 2023లో అరెస్టు అయ్యారు. ప్రస్తుతం అసోంలోని దిబ్రూగఢ్ జైల్లో ఉన్నారు. ఇంజినీర్ అబ్దుల్ రషీద్ ఉగ్ర కార్యకలాపాలకు నిధులు సమకూర్చారన్న అభియోగాలపై 2019లో అరెస్టు అయ్యారు. ఈయన తీహార్ జైల్లో ఉన్నారు. వీరిద్దరు కూడా 2 లక్షల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. అయితే ఈ కేసుల్లో వారు దోషులుగా తేలి రెండేండ్లు లేదా అంతకంటే ఎక్కువ జైలు శిక్షను ఎదుర్కొంటే.. ప్రజాప్రాతినిధ్యం చట్టం ప్రకారం రాజ్యాంగ పదవుల్లో ఉండడానికి అనర్హులవుతారు. అప్పుడు లోక్‌సభ సభ్యత్వాన్ని కోల్పోతారు. జైలు శిక్ష కాలంతో పాటు మరో ఆరేండ్లు ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా వీలుండదు. ప్రజాప్రతినిధులు దోషులుగా తేలిన వెంటనే అనర్హులుగా పరిగణించాలని 2013లో సుప్రీంకోర్టు స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.