న్యూఢిల్లీ, ఫిబ్రవరి 18 : దేశ రాజధానిలో 1984లో జరిగిన సిక్కు వ్యతిరేక అల్లర్లకు సంబంధించిన జంట హత్యల కేసులో దోషిగా తేలిన కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ సజ్జన్ కుమార్కు మరణ శిక్ష విధించాలని మంగళవారం న్యాయస్థానాన్ని ప్రాసిక్యూషన్ కోరింది. ప్రాసిక్యూషన్ తరఫు న్యాయవాది తమ వాదనను లిఖిత రూపంలో ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజాకు అందచేశారు. హత్య కేసులో కనీస శిక్ష యావజ్జీవ కారాగారం కాగా అత్యంత అరుదైన ఈ కేసులో దోషికి మరణ శిక్ష విధించాలని ప్రాసిక్యూషన్ కోరింది. తమ వాదనను సమర్పించడానికి కొంత వ్యవధి కావాలని సజ్జన్ కుమార్ తరఫు న్యాయవాది కోర్టును కోరారు. దీంతో కేసు ను ఫిబ్రవరి 21కి ప్రత్యేక న్యాయమూర్తి వాయిదా వేశారు.