జైపూర్: నిషేధిత టైగర్ రిజర్వ్‌లోకి కొందరు అక్రమంగా ప్రవేశించారు. పలు వాహనాల్లో లోపలకు చేరుకున్నారు. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు స్పందించారు. సుమారు 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. (vehicles seized) రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లో ఈ సంఘటన జరిగింది. వర్షాకాలం కారణంగా రణతంబోర్ నేషనల్ పార్క్‌లో జంగిల్ సఫారీని నిలిపివేశారు. అయితే ఆగస్ట్ 15న పలువురు వ్యక్తులు పలు లగ్జరీ వాహనాల్లో నిషేధిత టైగర్ రిజర్వ్‌లోకి ప్రవేశించారు. అడ్వెంచర్ టూర్ కోసం అక్కడకు చేరుకున్నారు.
కాగా, టైగర్ రిజర్వ్‌లో కొందరు అక్రమంగా సఫారీ చేస్తున్న ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో అటవీశాఖ అధికారులు వెంటనే స్పందించారు. నిషేధిత టైగర్ రిజర్వ్‌లోకి ప్రవేశించిన 19 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. రణతంబోర్ నేషనల్ పార్క్ జోన్ 8 వద్ద 14, సమీపంలోని హోటళ్ల వద్ద ఐదు వాహనాలను సీజ్ చేశారు.
మరోవైపు స్వాధీనం చేసుకున్న ఖరీదైన వాహనాలకు రాజస్థాన్, హర్యానా, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర నంబర్ ప్లేట్లు ఉన్నాయని డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ రామానంద్ భాకర్ తెలిపారు. గట్టి నిఘా ఉన్నప్పటికీ నిషేధిత ప్రాంతంలోకి పర్యాటకులు ఎలా ప్రవేశించారు అన్నదానిపై దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు.