భువనేశ్వర్: ఒడిశాలో రెండేళ్లలో పాము కాటు(Snake Bite) వల్ల 1859 మంది మృతిచెందారు. 2023-24, 2024-25 సీజన్లో ఆ మరణాలు చోటుచేసుకున్నట్లు రెవన్యూ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ శాఖ మంత్రి సురేశ్ పూజారి వెల్లడించారు. 2023-24లో పాము కాటు వల్ల 1150 మంది, ఆ తర్వాత సంవత్సరం 709 మంది మరణించినట్లు చెప్పారు. అసెంబ్లీలో మాట్లాడుతూ ఆయన ఈ వివరాలను వెల్లడించారు. ఎస్డీఆర్ఎఫ్ నిధుల నుంచి బాధిత కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం నష్టపరిహారాన్ని అందజేస్తుందన్నారు. స్థానిక అధికారుల దర్యాప్తు, పోస్టు మార్టమ్ రిపోర్టు ఆధారంగా బాధితులకు పరిహారాన్ని ఇస్తారని చెప్పారు.
కటక్ జిల్లాలో అత్యధికంగా 162 మంది పాము కాటుతో మృతిచెందారు. గంజామ్ జిల్లాలో 155, బాలసోర్‌లో 139, కీన్జోర్లో 132, సుందర్ఘర్లో 102 కేసులు నమోదు అయ్యాయి. గజపతి జిల్లాలో అత్యల్పంగా కేవలం 10 పాము కాటు మృతి కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. 1150 మంది పాము కాటు మృతుల్లో.. 1022 మంది బాధితులకు నష్టపరిహారాన్ని రిలీజ్ చేసినట్లు తెలిపారు. 22 రిపోర్టులను తిరస్కరించామన్నారు. 106 కేసులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలిపారు.
ఇక 2024-25 సీజన్లో 709 మృతుల్లో.. 435 బాధిత కుటుంబాలకు పరిహారాన్ని ఇచ్చామన్నారు. 8 కేసులను తిరస్కరించారు. 266 కేసులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఒడిశా ప్రభుత్వం 2015 నుంచి పాము కాటు మృతులకు 4 లక్షల నష్టపరిహారాన్ని అందజేస్తున్నది. నష్టపరిహారాన్ని బాధిత కుటుంబానికి చెందిన బ్యాంక్ అకౌంట్‌కు నేరుగా ట్రాన్స్ఫర్ చేస్తారు.