కాన్పూర్ : బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో మంగళ, బుధవారాల్లో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఐదు మీటర్ల వెడల్పు ఉన్న వీఐపీ రోడ్డులోని కొంత భాగం కుంగిపోవడంతో 18 అడుగుల లోతైన గుంత ఏర్పడింది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపథ్యంలో నగరంలోని రోడ్ల దుస్థితిపై సమాజ్వాదీ పార్టీ(ఎస్పీ) ఎమ్మెల్యే హసన్ రూమీ గురువారం జౌజ్మా ప్రాంతంలో చేపట్టిన నిరసనలో భాగంగా ఈ 18 అడుగులు లోతైన గుంతలో దిగారు.
రోడ్డుపై నుంచి వర్షపు నీరు వేగంగా ప్రవహిస్తూ, నేరుగా ఆ గుంతలోకి పడుతుండటం కనిపించింది. ఇది రోడ్డు మధ్యలో దాదాపు ఒక జలపాతంలా కనిపించింది. నగరంలోని ఈ రోడ్డు అధ్వాన్న స్థితి గురించి తెలుసుకున్న కాంట్ అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రూమీ గురువారం మధ్యాహ్నం ఆ స్థలానికి చేరుకుని నిచ్చెన సాయంతో ఆ గుంతలోకి దిగారు. అక్కడి రూమీ నిరసన తెలుపుతున్న దృశ్యాలు ఆన్లైన్లో వైరల్ అయ్యాయి.