బీజింగ్: భారత్, చైనా సరిహద్దుల్లో మరో సారి ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. ఇటీవల అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్లోని తవాంగ్ సెక్టార్ వద్ద చైనా సైనికులు భారత భూభాగంలోకి చొరబడే ప్రయత్నం చేశారు. ఈ నేపథ్యంలో భారత, చైనా కార్ప్స్ కమాండర్ల స్థాయి సమావేశం జరిగింది. 17వ రౌండ్ సమావేశం చైనా బోర్డర్ వైపున ఉన్న మాల్డో-చుసుల్ సరిహద్దు వద్ద జరిగినట్లు చైనా రక్షణ శాఖ కార్యాలయం వెల్లడించింది. మంగళవారం ఈ భేటీ జరిగినట్లు ఇవాళ ప్రకటన చేశారు.
చివరిసారి ఈ ఏడాది జూలై 17న రెండు దేశాల మధ్య కార్ప్స్ కమాండర్ లెవల్ మీటింగ్ జరిగింది. వెస్ట్రన్ సెక్టార్లో ఎల్ఏసీ వద్ద జరుగుతున్న పరిణామాలపై ఆ మీటింగ్లో చర్చించారు. రెండు దేశాల అధికారులు లోతుగా సరిహద్దు సమస్యల్ని చర్చించారు. లైన్ ఆఫ్ యాక్టువల్ కంట్రోల్ వద్ద శాంతి, సామర్యం ఏర్పాటు దిశగా ప్రయత్నాలు జరిగినట్లు ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది.
వెస్ట్రన్ సెక్టార్లో భద్రతను, స్థిరత్వాన్ని మెయిన్టేన్ చేసేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు ప్రకటనలో తెలిపారు. సైనిక, దౌత్యపరమైన రీతిలో సరిహద్దు సమస్యలపై చర్చించేందుకు రెండు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు.