న్యూఢిల్లీ, డిసెంబర్ 4: ప్రముఖ మ్యూజిక్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ స్పాటిఫై 17 శాతం మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు ప్రకటించింది. ఆర్థిక అనిశ్చితుల కారణంగా ఖర్చులు తగ్గించుకొనేందుకు లే ఆఫ్స్ ప్రకటిస్తున్నట్టు వెల్లడించింది. ఈ విషయాన్ని సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో డానియేల్ ఏక్ సోమవారం సోషల్ మీడియాలో తెలిపారు. స్పాటిఫైలో ప్రస్తుతం 8,800 మంది పనిచేస్తుండగా, తాజా నిర్ణయం ప్రభావం 1,500 మంది ఉద్యోగులపై పడనున్నది. ఏడాది వ్యవధిలోనే ఈ సంస్థ లేఆఫ్స్ ప్రకటించడం ఇది మూడోసారి. ఈ సంస్థ జనవరిలో తొలిసారిగా 600 మంది (6 శాతం) ఉద్యోగులను, జూన్లో రెండోసారి మరో 200 మంది (2 శాతం) ఉద్యోగులను తొలగించింది. ఇప్పడు మూడోసారి మరో 1500 మందిని తీసివేయన్నట్టు ప్రకటించింది.