న్యూఢిల్లీ: దేశంలో మళ్లీ కరోనా వైరస్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా 163 కేసుల్లో కొత్త కోవిడ్ వేరియంట్ ఎక్స్ఎఫ్జీని(XFG Variant) గుర్తించినట్లు అధికారులు తెలిపారు. ఇండియన్ సార్స్ సీవోవీ2 జీనోమిక్స్ కన్సోర్టియం(ఐఎన్ఎస్ఏసీఓజీ) డేటా ఆధారంగా ఈ విషయం తెలిసింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్స్ఎఫ్జీ వేరియంట్ శరవేగంగా వ్యాపిస్తున్నట్లు ఇటీవల ద లాన్సెట్ జర్నల్‌లో ఓ రిపోర్టును ప్రచురించారు. ఎక్స్ఎఫ్జీ వేరియంట్లో నాలుగు కీలకమైన స్పైక్ ముటేషన్స్ ఉన్నాయని, దీని వల్లే వేగంగా ఆ వైరస్ వ్యాప్తి అవుతున్నట్లు చెప్పారు.
తొలుత ఈ వేరియంట్ వైరస్‌ను కెనడాలో గుర్తించారు. ఇండియాలో ఎక్స్ఎఫ్జీ వేరియంట్ 163 శ్యాంపిళ్లలో గుర్తించినట్లు జీనోమిక్స్ కన్సోర్టియం పేర్కొన్నది. మహారాష్ట్రలో అత్యధికంగా 89, తమిళనాడులో 16, కేరళలో 15, గుజరాత్లో 11, ఏపీ.. మద్యప్రదేశ్.. బెంగాల్ రాష్ట్రాల్లో ఆరేసి కేసులు నమోదు అయినట్లు రపోర్టు అవుతున్నది. మే నెలలోనే 159 శ్యాంపిళ్లలో ఎక్స్ఎఫ్జీ వేరియంట్‌ను గుర్తించారు.
ఇక రెండు శ్యాంపిళ్లను ఏప్రిల్‌లో, రెండు జూన్‌లో పసికట్టారు. ప్రస్తుతం కోవిడ్ యాక్టివ్ కేసుల సంఖ ఆరు వేల మార్క్ దాటింది.