హైదరాబాద్ : 2014లో పంజాబ్‌లోని అజ్నాలా బావిలో 160 అస్థిపంజరాలు బయటపడిన సంగతి తెలిసిందే. భారీ స్థాయిలో బయటపడ్డ ఈ అస్థిపంజరాలు ఎవరివి అనే అంశాన్ని తెలుసుకునేందుకు హైదరాబాద్‌కు చెందిన సీసీఎంబీ శాస్త్రవేత్తలతో పాటు ఇతర భారత పరిశోధన సంస్థలు విస్తృతంగా పరిశోధనలు జరిపాయి. అయితే ఆ అస్థిపంజరాలు 1857లో బ్రిటీష్ ఆర్మీ చేత చంపబడిన భారత సిపాయిలవి అని నమ్ముతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది.
ఫ్రంటైర్స్ ఇన్ జెనెటికస్ అనే జర్నల్‌లో ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిష్ చేయడం జరిగింది. సీసీఎంబీ శాస్త్రవేత్తలు, పంజాబ్ యూనివర్సిటీ, బీర్బల్ సాహ్ని ఇన్స్టిట్యూట్(లక్నో), బనారస్ హిందూ యూనివర్సిటీలకు చెందిన పరిశోధకులు.. ఈ అస్థిపంజరాల మూలాలను గుర్తించేందుకు డీఎన్ఎ, ఐసోటోపుల ఆధారంగా పరిశోధనలు చేశారు.
అయితే 2014లో అజ్నాలా బావిలో అస్థిపంజరాలు బయటపడినప్పుడు.. వాటిపై వివిధ రకాల కథనాలు వెలువడ్డాయి. పాకిస్తాన్, ఇండియా విభజన సందర్భంగా చెలరేగిన అల్లర్లలో మరణించిన వారివి ఆ స్కెలిటన్స్ అని చరిత్రకారులు నమ్ముతున్నారు.
భారత స్వాతంత్య్ర ఉద్యమంలో 1857లో బ్రిటీష్ ఆర్మీ చేత చంపబడిన ఇండియన్ సోల్జర్స్ అస్థిపంజరాలుగా చారిత్రాక ఆధారాల ఆధారంగా కొందరు నమ్ముతున్నారు. ఏదేమైనప్పటికీ.. సైనికులు గుర్తింపు, భౌగోళిక మూలాలకు సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేకపోవడంతో ఇప్పటికీ చర్చకు దారితీస్తున్నాయి.
అస్థిపంజరాలు గంగా మైదాన ప్రాంతంలోని నివాసితులవని పరిశోధకుల అధ్యయనంలో తేలింది. డీఎన్ఏ విశ్లేషణ కోసం 50 నమూనాలను, ఐసోటోప్ విశ్లేషణ కోసం 85 నమూనాలను పరిశోధకులు ఉపయోగించారు.
ఈ సందర్భంగా సీసీఎంబీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ కే తంగరాజ్ మాట్లాడుతూ.. ప్రజల పూర్వీకులను అర్థం చేసుకునేందుకు డీఎన్ఏ విశ్లేషణ సహాయపడుతుందన్నారు. ఐసోటోపుల విశ్లేషణ ఆహారపు అలవాట్లను తెలియపరుస్తుందన్నారు. అయితే ఈ రెండు విశ్లేషణల ద్వారా ఆ బావిలో లభించిన అస్థిపంజరాలు పంజాబ్ లేదా పాకిస్తాన్‌కు చెందిన వ్యక్తులవి కాదని తేలిందన్నారు. అయితే డీఏన్ఏ విశ్లేషణలు ఉత్తరప్రదేశ్, బీహార్, పశ్చిమ బెంగాల్‌లోని వ్యక్తులతో సరిపోలినట్లు ఆయన పేర్కొన్నారు.
పంజాబ్ యూనివర్సిటీకి చెందిన ఆంథ్రోపాలజిస్ట్ డాక్టర్ జేఎస్ షెహ్రవత్ మాట్లాడుతూ.. ఈ పరిశోధన ఫలితాలు 26th నేటివ్ బెంగాల్ ఇన్ఫాంట్రీ బెటాలియన్‌కు చెందిన బెంగాల్, ఒడిశా, బీహార్, ఉత్తరప్రదేశ్‌లోని తూర్పు భాగానికి చెందిన వ్యక్తులతో కూడిన చారిత్రక ఆధారాలకు అనుగుణంగా ఉన్నాయని తెలిపారు.
చారిత్రక ఆధారాల ప్రకారం.. పాకిస్తాన్‌లోని మియాన్ మీర్‌లో నియమించబడ్డ 26th బెటాలియన్‌కు చెందిన సైనికులు తిరుగుబాటు ఉద్యమంలో బ్రిటీష్ అధికారులను చంపారు. అయితే వారిని అజ్నాలా సమీపంలో బ్రిటీష్ ఆర్మీ బంధించి ఉరి తీసినట్లు పరిశోధనలు తెలుపుతున్నాయి.
సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ నడికూడిని మాట్లాడుతూ.. పురాతన డీఎన్ఏ అధ్యయనం మన గతంతో పాటు చారిత్రక దృక్పథాన్ని అర్థం చేసుకోవడంలో శక్తివంతంగా ఉపయోపడే సాధనం అని పేర్కొన్నారు. పెద్ద ఎత్తున పురాతన డీఎన్ఏ అధ్యయనాన్ని చేపట్టాలని సీసీఎంబీ యోచిస్తోందన్నారు. ఈ అధ్యయనం అనేక చారిత్రక, పూర్వ చారిత్రక వాస్తవాలను వెలుగులోకి తెస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.