ముంబై, మే 10( నమస్తే తెలంగాణ): ముంబైలోని కల్యాణ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడేండ్లుగా మిస్టరీగా మారిన ఓ చిన్నారి అదృశ్యం కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. 9 ఏండ్ల వయసులో కనిపించకుండా పోయిన బాలిక, స్వచ్ఛంద సంస్థ సాయంతో 16 ఏండ్ల వయసులో తల్లిదండ్రుల వద్దకు చేరుకుంది. అసలేమైందీ… ఇన్నాళ్లు ఎక్కడుందో తెలిపింది. ఈ దారుణమంతా విన్న తల్లిదండ్రులు బోరున విలపించారు.
2018లో తనను ఓ మహిళ, మరో వ్యక్తి కలిసి కిడ్నాప్ చేశారని బాలిక తెలిపింది. వారు రాజస్థాన్‌కు చెందిన మరోవ్యక్తికి విక్రయించారని వెల్లడించింది. ఆ వ్యక్తి.. 2020 లో తన అల్లుడికి ఇచ్చి పెళ్లి చేశాడని వివరించింది. ఆ తర్వాత పెళ్లి చేసుకున్న వ్యక్తితో పాటు అతడి మామ తనపై లైంగిక వేధింపులకు పాల్పడేవారని తెలిపింది. స్వచ్ఛంద సంస్థ సాయంతో తన ఇద్దరు పిల్లలను వెంటబెట్టుకుని ముంబై వచ్చినట్టు వివరించింది. పోలీసులకు ఫిర్యాదు చేయగా బాలికను యువకుడిని, అతడి మామను అరెస్ట్ చేశారు. మరో ముగ్గురు నిందితుల కోసం గాలిస్తున్నారు. డీసీపీ అతుల్ జెండే, సీఐ జ్ఞానేశ్వర్ సాబ్లే దర్యాప్తు కోసం నాలుగు బృందాలను నియమించారు. స్వప్నిల్ భుజబల్, వికాస్ మడేతో కూడిన బృందం నిందితుల కోసం వేట కొనసాగిస్తున్నదని చెప్పారు.