న్యూఢిల్లీ, జూలై 19: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చమోలి జిల్లా అలకనందా నదిపై నమామి గంగే ప్రాజెక్ట్ వద్ద బుధవారం ఉదయం విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్ పేలి..16మంది దుర్మరణం పాలయ్యారు. పదుల సంఖ్యలో తీవ్రంగా గాయపడగా వారిని దవాఖానకు తరలించి వైద్య చికిత్స అందిస్తున్నారు. ఇందులో కొంతమంది పరిస్థితి సీరియస్‌గా ఉందని తెలిసింది. ట్రాన్స్ఫార్మర్ పేలి..బ్రిడ్జి రెయిలింగ్పైన పడిపోవటంతో అక్కడున్నవారంతా విద్యుత్ఘాతానికి గురైనట్టు భావిస్తున్నామని పోలీస్ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. చనిపోయినవారిలో ముగ్గురు హోం గార్డులు, ముగ్గురు సబ్ ఇన్స్పెక్టర్లు ఉన్నారని తెలిసింది. ప్రమాద ఘటనపై సీఎం పుష్కర్‌సింగ్ ధామీ మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. మంగళవారం రాత్రి బ్రిడ్జి వద్ద పనిచేస్తున్న ఓ కార్మికుడు విద్యుత్ షాక్‌కు గురై చనిపోయాడు. విచారణ చేయడానికి బుధవారం కొంతమంది పోలీసులు అక్కడకు వెళ్లగా, మరోమారు బ్రిడ్జ్‌కు విద్యుత్ ప్రవాహం ఏర్పడి..అక్కడ గుమికూడిన వారికి కరెంట్ షాక్ తగిలిందని చమోలి జిల్లా డిజాస్టర్ మేనేజ్మెంట్ అధికారి ఎన్కే జోషి చెప్పారు.