అహ్మదాబాద్, ఆగస్టు 13: గుజరాత్లో దాదాపు 150 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు మిస్సింగ్ అయ్యారు! టీచర్లు ఏంటి.. అదృశ్యం కావడమేంటి అని అనుకొంటున్నారా? అవును రాష్ట్రంలోని పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులుగా ఉన్న వాళ్లు గత కొన్నాళ్లుగా కనిపించడం లేదు. దాదాపు 50 మంది రాష్ట్రంలో ఓవైపు టీచర్ పోస్టులో ఉండగానే.. వారంతా విదేశాల్లో సెటిల్ అయినట్టు ఆరోపణలు గుప్పుమంటున్నాయి.
మిగతా దాదాపు 100 మంది ఉపాధ్యాయులు కూడా పాఠశాలలకు హాజరు కాకుండా ఎలాంటి అనుమతి లేకుండా సంవత్సరాలుగా, నెలలుగా అనధికార సెలవుపై ఉన్నట్టు తెలుస్తున్నది. ఇక్కడ కొసమెరుపు ఏంటంటే, విదేశాల్లో సెటిల్ అయినప్పటికీ లేదా అనధికార సెలవుపై ఉన్నప్పటికీ, వారి ఖాతాల్లో ప్రతి నెలా జీతం పడుతున్నట్టు పలు మీడియా నివేదికలు చెబుతున్నాయి.
గత వారం బనస్కాంత జిల్లాకు చెందిన ఓ టీచర్ గత కొన్నేండ్లుగా అమెరికాలో నివాసం ఉంటున్నట్టు, ఆయన ఈ ఏడాది జనవరి వరకు జీతం తీసుకొన్నాడని తేలింది. పలు ఇతర జిల్లాల్లోనూ ఈ విధమైన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఉపాధ్యాయుల మిస్సింగ్ వ్యవహారంపై ప్రతిపక్ష కాంగ్రెస్ స్పందించింది. ఇది వ్యవస్థీకృత స్కామ్ అని విమర్శించింది. అలాంటి టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. కంట్రోల్ అండ్ కమాండ్ సెంటర్(సీసీసీ) ద్వారా దాదాపు 50 వేలకు పైగా పాఠశాలల్లో ఉపాధ్యాయుల అటెండెన్స్, టీచర్లు, విద్యార్థుల కార్యకలాపాలపై రియల్ టైమ్ పర్యవేక్షణ చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నదని, అయితే తాజాగా వెలుగులోకి వచ్చిన అంశంపై ఏం సమాధానం చెబుతుందని ప్రశ్నించింది.
‘ఉపాధ్యాయుల మిస్సింగ్’ వ్యవహారం వెలుగులోకి రావడంతో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. విద్యా శాఖ మంత్రి ప్రఫుల్ పన్షేరియా సోమవారం మాట్లాడుతూ 32 మంది టీచర్ల విదేశాలకు వెళ్లినట్టు గుర్తించామని, 31 మంది అనధికార సెలవుల్లో ఉన్నారని తెలిపారు. సోమవారం నాటికి 17 జిల్లాల నుంచి ఈ మేరకు సమాచారం సేకరించామని పేర్కొన్నారు. అయితే వారిలో ఒక్కరు కూడా జీతం పొందడం లేదని చెప్పుకొచ్చారు. ఇతర జిల్లాల నుంచి కూడా సమాచారం సేకరిస్తున్నామని, చట్టానికి అనుగుణంగా తగిన చర్యలు తీసుకొంటామని తెలిపారు.