కాన్పూర్, డిసెంబర్ 24: ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త ఇంట్లో నోట్ల గుట్టలు బయటపడ్డాయి. పన్ను ఎగవేత ఆరోపణలపై సోదాలు చేసిన ఆదాయ పన్ను శాఖ అధికారులు.. అక్కడున్న నగదు చూసి షాక్‌కు గురయ్యారు. 5 కౌంటింగ్ మెషీన్లతో దాదాపు 36 గంటలపాటు నోట్ల కట్టలను లెక్కించగా.. రూ.150 కోట్లకు పైగా సొమ్ము తేలినట్టు అధికారులు తెలిపారు. ఇది తమ చరిత్రలోనే అతిపెద్ద రికవరీ అని కేంద్ర పరోక్ష పన్నుల, కస్టమ్స్ బోర్డు(సీబీఐసీ) చైర్మన్ వివేక్ జోహ్రి చెప్పారు. యూపీలోని కాన్పూర్‌కి చెందిన ఫర్ఫ్యూమ్ ఇండస్ట్రీ వ్యాపారవేత్త పీయూష్ జైన్ నివాసంలో గురువారం ఐటీ అధికారులు ఈ సోదాలు నిర్వహించారు. రెండు బీరువాల్లో పెద్ద మొత్తంలో నోట్ల కట్టలు గుర్తించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు వైరల్‌గా మారాయి. ఈ సొమ్మంతా నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి, ఈవే బిల్లులు లేకుండా రవాణా చేసిన సరుకుకు సంబంధించినదిగా అధికారులు గుర్తించారు. డొల్ల కంపెనీల పేరుతో ఫేక్ ఇన్వాయిస్లను సృష్టించి జీఎస్టీని ఎగ్గొట్టినట్టు తెలిపారు. ఓ వేర్‌హౌస్‌లో నాలుగు ట్రక్కుల్లో ఉన్న 200 నకిలీ ఇన్వాయిస్లను గుర్తించిన అధికారులు వాటిని సీజ్ చేశారు. కాన్పూర్‌లోని పీయూష్ జైన్ నివాసంతో పాటు గుజరాత్, మహారాష్ట్రల్లోని ఆయన కంపెనీ కార్యాలయాల్లోనూ సోదాలు చేశారు.
మీ పార్టీయే.. కాదు మీ వ్యక్తే..!
ఐటీ సోదాల నేపథ్యంలో బీజేపీ, ఎస్పీ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి. పీయూష్ జైన్ మీ పార్టీకి చెందిన వ్యక్తి అంటే.. కాదు మీ పార్టీ వాడే అని ఇరు పార్టీలకు చెందిన నేతలు కౌంటర్లు ఇచ్చుకున్నారు. అవినీతి వ్యక్తులు, గూండాల నుంచి ఎస్పీకి సాయం అందుతుందని యూపీ బీజేపీ అధికార ప్రతినిధి రాకేష్ త్రిపాఠి ఆరోపించగా, తమ పార్టీతో పీయూష్ జైన్‌కి ఎలాంటి సంబంధం లేదని ఎస్పీ ప్రతినిధి రాజేంద్ర చౌదరి పేర్కొన్నారు. ఆ వ్యాపారవేత్త బీజేపీకి చెందిన వ్యక్తే అని, డబుల్ ఇంజిన్ ప్రభుత్వ హయాంలో దోపిడీ కూడా డబుల్ అయిందని మరో ఎస్పీ నేత అనురాగ్ బదౌరియా అన్నారు.