జోధ్‌పూర్: దేశంలో మైనర్లు, మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయి. తాజాగా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో 15 ఏండ్ల బాలికపై ఇద్దరు సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, బాధితురాలు ఈ నెల 25న కుటుంబ సభ్యులతో గొడవపడి, ఎవరికీ తెలియకుండా ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. మహాత్మా గాంధీ ప్రభుత్వ దవాఖానలో ఆమె రాత్రి సమయంలో ఒంటరిగా కనిపించడంతో ఇద్దరు వ్యక్తులు ఆమెను ప్రలోభపెట్టారు. దవాఖానలోని బయో-మెడికల్ వ్యర్థాల సెక్షన్వైపు తీసుకెళ్లి, సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అంతకుముందు ఆమె కనిపించడం లేదని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సోమవారం ఆమెను దవాఖాన ప్రాంగణంలో గుర్తించారు. ఆమె తీవ్ర ఆందోళనతో కనిపించింది. ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి, స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఆమెపై గ్యాంగ్ రేప్ జరిగినట్లు కేసు నమోదు చేశారు. ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. నిందితులిద్దరినీ అదుపులోకి తీసుకుని, ప్రశ్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వీరిలో ఒకడు గతంలో ఈ దవాఖానలో పని చేసినట్లు అధికారులు తెలిపారు.
నర్సింగ్ విద్యార్థినిపై ఆటో డ్రైవర్ అఘాయిత్యం
మత్తు నీళ్లు తాగించి లైంగికదాడి.. మహారాష్ట్రలో మరో ఘోరం
ముంబై, ఆగస్టు 27( నమస్తే తెలంగాణ): మహిళలపై జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ సోమవారం మహారాష్ట్రలోని రత్నగిరి జిల్లాలో ఓ ఆటో డ్రైవర్ ఓ నర్సింగ్ విద్యార్థిని(19)పై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. ఇంటికి వెళ్లడానికి ఆటో ఎక్కిన బాధితురాలిని నీళ్లు తాగమని డ్రైవర్ కోరాడు. నీళ్లలో మత్తు మందు కలిపి ఉండటంతో అవి తాగిన తర్వాత ఆమె స్పృహ కోల్పోయింది. అనంతరం ఆటో డ్రైవర్ ఆమెను నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్పృహ వచ్చిన తర్వాత బాధితురాలు ఘటన గురించి తన కుటుంబానికి తెలియజేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలిస్తున్నారు. ఘటనపై దర్యాప్తునకు మహిళా ఇన్స్పెక్టర్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసినట్టు రత్నగిరి ఎస్పీ వెల్లడించారు. బాధితురాలు ఓ ప్రభుత్వ దవాఖానలో కోలుకుంటున్నది. దోషికి ఉరి శిక్ష విధించాలని బాధితురాలు పనిచేస్తున్న దవాఖాన నర్సులు, సిబ్బంది, స్థానికులు డిమాండ్ చేశారు. నిరసన ప్రదర్శనలు నిర్వహించి రోడ్లను దిగ్భందించారు. ఇటీవలే బద్లాపూర్‌లోని ఓ పాఠశాలలో బాలికలపై లైంగిక వేధింపుల ఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే.