న్యూఢిల్లీ, సెప్టెంబర్ 2: సుమారు 13 ఏండ్ల పాటు గుండె-ఊపిరితిత్తుల మార్పిడి శస్త్రచికిత్స కోసం ఎదురుచూసిన బాలిక జీవితం విషాదంగా ముగిసింది. రాజస్థాన్‌లోని కోటాకు చెందిన 15 ఏండ్ల తన్వీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. ఎయిమ్స్‌లో గుండె-ఊపిరితిత్తుల మార్పిడి కోసం పరీక్షలు నిర్వహిస్తుండగా తెల్లవారుజామున మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. పుట్టుకతోనే తన్వీకి వచ్చిన సంక్లిష్టమైన వ్యాధిని వెంట్రిక్యులర్ సెప్టల్ డిఫెక్ట్ విత్ పల్మనరీ అట్రిసియాగా గుర్తించారు.
దీంతో తన్వీకి రెండేళ్ల వయసు నుంచి ఆమెను కుటుంబం ఎయిమ్స్‌కు తీసుకువచ్చి చికిత్స అందిస్తున్నది. ఆమెకు ఆపరేషన్ రేపు మాపు అంటూ ఏండ్లు గడిపిన వైద్యులు ఆమె ప్రాణంతో ఆటలాడుకున్నారు. ఎట్టకేలకు డాక్టర్ల సలహా మేరకు ట్రాన్స్‌ప్లాంట్ కోసం తన కుమార్తెను ఆగస్టు 18న ఎయిమ్స్‌లో చేర్చినట్టు ఆమె తండ్రి ముఖేష్ పరియానీ తెలిపారు. తన బిడ్డ గుండెకు సరైన చికిత్స కోసం 13 ఏండ్లకు పైగా ఎదురుచూశామని, కానీ ఆపరేషన్ మాత్రం జరుగలేదని ఆయన ఆరోపించారు.