శ్రీనగర్ : నిన్న సాయంత్రం అమర్నాథ్ గుహ వద్ద వరద బీభత్సం సృష్టించిన సంగతి తెలిసిందే. దీంతో గుహ ప్రాంతానికి సమీపంలో చాలా మంది యాత్రికులు చిక్కుకుపోయారని ఐటీబీపీ జవాన్లు తెలిపారు. వరద బీభత్సం నుంచి 15 వేల మంది యాత్రికులను సురక్షితంగా కాపాడగలిగామని పేర్కొన్నారు. యాత్రికులందర్నీ పంజ్‌తర్నికి తరలించామన్నారు. గుహ వద్ద నుంచి పంజ్‌తర్ని వరకు ఐటీబీపీ జవాన్లు బందోబస్తు కల్పించారు. ఇప్పటి వరకు 15 మంది సజీవ సమాధి కాగా, పదుల సంఖ్యలో యాత్రికులు గల్లంతయ్యారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నదని అధికారులు చెబుతున్నారు.
అయితే శనివారం తెల్లవారుజాము నుంచే ఐటీబీపీ, ఎన్డీఆర్ఎఫ్ దళాలు కలిసి సహాయక చర్యలు ప్రారంభించాయి. ఆర్మీ హెలికాప్టర్లలో అమర్నాథ్ యాత్రికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఇవాళ ఉదయం ఆరుగురు యాత్రికులను హెలికాప్టర్లో నీలగ్రార్ హెలిప్యాడ్‌కు తరలించారు. అక్కడ వైద్య బృందాలు చికిత్స అందిస్తున్నాయి. గల్లంతైన వారి ఆచూకీ కోసం మౌంటెన్ రెస్క్యూ టీమ్స్ తనిఖీలు చేస్తున్నాయి. అమర్నాథ్ గుహ వద్ద రెస్క్యూ ఆపరేషన్ నిమిత్తం రెండు రెస్క్యూ శునకాలను హెలికాప్టర్లో తరలించారు.