జమ్ము/శ్రీనగర్, మే 7: జమ్ము కశ్మీరులోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి సరిహద్దు గ్రామాలపై పాకిస్థాన్ సైన్యం విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో నలుగురు పిల్లలు, ఇద్దరు మహిళలతోసహా 12 మంది మరణించగా మరో 57 మంది గాయపడ్డారు. పాకిస్థాన్‌లోని, పాక్ ఆక్రమిత కశ్మీరులోని 9 ఉగ్రవాద స్థావరాలపై భారత సాయుధ దళాలు దాడులు జరిపిన తర్వాత పాకిస్థాన్ సైన్యం ఎల్ఓసీ వెంబడి ఉన్న భారత గ్రామాలపై భారీగా కాల్పులు జరిపినట్లు బుధవారం అధికారులు తెలిపారు. పాక్ సైనిక బలగాల కాల్పులకు భారత సైన్యం దీటుగా జవాబిస్తున్నట్లు వారు చెప్పారు. కాల్పులకు తెగబడిన పాక్ సైనిక పోస్టులను భారత బలగాలు ధ్వంసం చేయడంతో శత్రు పక్షంలో కూడా భారీ సంఖ్యలో మరణాలు సంభవించినట్లు వారు చెప్పారు.
పాకిస్థానీ కాల్పులలో పూంచ్ జిల్లా బాగా నష్టపోయిందని, మృతి చెందిన పౌరులంతా ఇక్కడి వారేనని అధికారులు తెలిపారు. 50 మందికి పైగా పౌరులు కూడా గాయపడ్డారని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు పేర్కొన్నారు. పాకిస్థాన్ బలగాలు విచక్షణారహితంగా జరిపిన కాల్పులలో భీతిల్లిన సరిహద్దు గ్రామాల ప్రజలు భూగర్భ బంకర్లలోకి కొందరు, తమ గ్రామాల బయట సురక్షిత ప్రదేశాలలో మరికొందరు తలదాచుకున్నారు. నియంత్రణ రేఖ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి నివసించే వందలాది మంది పౌరులను అధికారులు బుధవారం సురక్షిత ప్రదేశాలకు తరలించారు.
ఎల్ఓసీ వెంబడి ఉన్న బాలాకోట్, మెంధర్, మన్‌కోటే, కృష్ణ ఘాటి, గుల్పూర్, కేర్నితోపాటు పూంచ్ జిల్లా ప్రధాన కార్యాలయంపై కూడా పాక్ సేనలు కాల్పులకు తెగబడ్డాయని అధికారులు తెలిపారు. ఈ కాల్పులలో అనేక ఇళ్లు, వాహనాలు ధ్వంసమయ్యాయని వారు చెప్పారు. బారాముల్లా జిల్లాలోని యూరీ సెక్టార్లో సరిహద్దు అవతల నుంచి జరిగిన కాల్పులలో ముగ్గురు మైనర్ పిల్లలతోసహా 10 మంది గాయపడ్డారు. రాజౌరీ జిల్లాలో ముగ్గురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. కుప్వారా జిల్లాలోని కర్నాహ్ సెక్టార్లో పాక్ దాడిలో పలు ఇళ్లు మంటల్లో చిక్కుకున్నాయని వారు చెప్పారు. ఉదయం సరిహద్దుల అవతల నుంచి భారీ స్థాయిలో జరిగిన కాల్పులు మధ్యాహ్నానికి తగ్గాయని, ప్రస్తుతం పూంచ్ సెక్టార్‌కే పరిమితమయ్యాయని తెలిపారు.
పాక్ విచక్షణారహితంగా జరుపుతున్న కాల్పుల మధ్య క్షతగాత్రులను దవాఖానలకు తరలించడం స్థానికులకు ఇబ్బందిగా మారింది. మంగళవారం-బుధవారం మధ్య రాత్రిలో ఎల్ఓసీ, అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న పోస్టుల నుంచి పాకిస్థానీ బలగాలు ఏకపక్షంగా కాల్పులు జరిపినట్లు రక్షణ శాఖ ప్రతినిధి ఒకరు తెలిపారు. భారత సైన్యం తగిన విధంగా స్పందిస్తున్నట్లు ఆయన చెప్పారు.
పాక్ కాల్పులకు ప్రతీకార చర్యగా భారత బలగాలు జరిపిన కాల్పులలో శత్రు సేనలో భారీ సంఖ్యలో నష్టం వాటిల్లినట్లు సైనిక వర్గాలు తెలిపాయి. జమ్ము ప్రాంతంలోని ఐదు సరిహద్దు జిల్లాలలో బుధవారం అన్ని విద్యా సంస్థలకు అధికారులు సెలవు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితి దృష్ట్యా జమ్ము, సంబా, కథువా, రాజౌరీ, పూంచ్‌లోని అన్ని స్కూళ్లు, కాలేజీలను బుధవారం మూసివేసినట్లు డివిజనర్ కమిషనర్ రమేష్ కుమార్ ఎక్స్ వేదికగా తెలిపారు. పంజాబ్, రాజస్థాన్‌లోని సరిహద్దు జిల్లాల్లో కూడా పాఠశాలలు మూసివేశారు.