మహారాష్ట్ర ;మహారాష్ట్రలో పాలకుల తీరుతో రైతుల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. సెప్టెంబర్లో ఇప్పటివరకూ ఒక్క యవత్మాల్ జిల్లాలో 15 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు బుధవారం ప్రకటన విడుదల చేశారు. వీరి మరణాలకు గల ప్రధాన కారణం తెలియదని, దీనిపై ప్రభుత్వం విచారణ జరుపుతున్నదని యవత్మాల్ జిల్లా కలెక్టరేట్ ఉన్నతాధికారి ఒకరు తాజాగా వెల్లడించారు. ఇంతమంది రైతులు తీవ్ర నిర్ణయం తీసుకోవటం వెనుక కారణాల్ని పోలీసు, రెవెన్యూ అధికారులు విచారణ జరుపుతున్నారని ప్రభుత్వం చెబుతున్నది. విదర్భ ప్రాంతంలోని యవత్మాల్ జిల్లాలో చోటుచేసుకుంటున్న రైతు ఆత్మహత్యలు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్నది. వ్యవసాయ సంక్షోభం, రుణ ఊబిలో కూరుకుపోవటం, ప్రభుత్వ విధానాలు ఆత్మహత్యలకు కారణమని సామాజిక కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. కేవలం మూడు రోజుల వ్యవధిలో ఆరుగురు రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని సామాజిక కార్యకర్త కిశోర్ తివారీ చెప్పారు.