రాంచీ : ఓ ముగ్గురి స్నేహితుల మధ్య చోటు చేసుకున్న వివాదం నిండు ప్రాణాన్ని బలిగొన్నది. స్నేహితుడినే మరో ఇద్దరు కలిసి మూడు ముక్కలుగా నరికేసి.. అడవుల్లోకి విసిరేశారు. ఈ దారుణ ఘటన జార్ఖండ్‌లోని దియోఘర్ జిల్లాలో వెలుగు చూసింది.
వివరాల్లోకి వెళ్తే.. రోహిణి గ్రామానికి చెందిన ఓ ఇద్దరు స్నేహితులు మంగళవారం రాత్రి 8:30 గంటల సమయంలో కుమ్రబాద్ స్టేషన్ రోడ్‌కు వెళ్లారు. అక్కడ అవినాష్(19) అనే ఫ్రెండ్‌ను ఈ ఇద్దరు కలిశారు. అయితే ఈ ముగ్గురు కలిసి స్థానికంగా ఉన్న అడవిలోకి వెళ్తుండగా, అవినాష్‌తో 14 ఏండ్ల యువకుడికి స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో ఆవేశంతో రగిలిపోయిన అవినాష్.. ఆ యువకుడి కాళ్లు, చేతులు కట్టేసి అత్యంత దారుణంగా కత్తితో పొడిచి చంపాడు. అంతటితో ఆగకుండా మృతదేహాన్ని మూడు ముక్కలుగా నరికేసి, గోనె సంచుల్లో చుట్టి అడవిలోకి విసిరేశారు.
అయితే తమ కుమారుడి అదృశ్యంపై తల్లిదండ్రులు బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నిందితులను 24 గంటల్లోనే అరెస్టు చేశారు. హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నారు. అడవిలో పడేసిన మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని మూడు ముక్కలుగా చేసినట్లు పోలీసులు నిర్ధారించారు.