Shaurya Gupta | న్యూఢిల్లీ: మీరు ప్రతి నెలా ఎంత ఖర్చు పెడుతున్నారో లెక్కలేసుకోవడం లేదా లేక మీరు మీ ఖర్చులన్నీ సరి చూసే యాప్ కావాలనుకుంటున్నారా? అయితే భారత సంతతి కెనడా బాలుడు శౌర్య గుప్తా రూపొందించిన ఏఐ ఆధారిత స్పెండ్స్మార్ట్ యాప్ వాడండి. ఈ యాప్ ప్రస్తుతానికి ఐఓఎస్‌లో ఉచితంగా లభిస్తున్నది. కేవలం మీరు మీ రశీదులు, బిల్లులు, ఖర్చుల డాక్యమెంట్లు స్కాన్ లేదా అప్లోడ్ చేస్తే చాలు. ఈ యాప్ వాటన్నింటినీ క్రోడీకరించి మీ ఖర్చుల వివరాలను వెల్లడిస్తుంది.
యాప్‌లోకి లాగిన్ అయ్యాక న్యూ ఎక్స్పెన్స్ మీద క్లిక్ చేసి ఖర్చుల బిల్ లేదా రశీదు ఫొటోను స్కాన్ లేదా అప్లోడ్ చేయాలి. బిల్ లేదా రశీదు పెద్దగా ఉంటే దాన్ని నాలుగైదు ఫొటోలుగా తీసి అప్లోడ్ చేసినా.. ఈ యాప్ అన్నింటిని కలిపి ఒక్కటిగా లెక్కేసుకొని చక్కగా ఖర్చు లెక్కలేస్తుంది. అలా ఒక్కొక్క బిల్ లేదా రశీదు జత చేస్తూ పోతే మనం ఎంత మొత్తం ఖర్చు పెడుతున్నామో ఆటోమేటిగ్గా చూపించి, మనం ఎంత ఆదా చేశామో.. మన నెలవారీ ఖర్చు ఎంతో చూపిస్తుంది. హిస్టరీ సెక్షన్లో పాత బిల్లు కావాల్సి వస్తే ఆ బిల్లు లోగో మీద క్లిక్ చేస్తే వెంటనే దాన్ని ట్రాక్ చేస్తుంది. ఈ యాప్ చెల్లింపు విధానం, కరెన్సీ, బిల్లు ఇచ్చిన ప్రాంతం, విభాగం, బిల్లులోని ఒక్కో వస్తువు వివరాలు, వాటి ధరలు, రాయితీలను నమోదు చేస్తుంది.