న్యూఢిల్లీ, ఆగస్టు 2: ఢిల్లీలోని ఆశా కిరణ్ షెల్టర్ హోమ్‌లో ‘అనుమానాస్పద’ మరణాలు కలకలం రేపుతున్నాయి. దివ్యాంగుల కోసం రోహిణిలో ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న ఈ షెల్టర్ హోమ్‌లో గత 20 రోజుల్లో 14 మంది, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు 27 మంది మృతిచెందినట్టు సబ్ డివిజినల్ మేజిస్ట్రేట్ (ఎస్డీఎం) దర్యాప్తులో వెల్లడైంది. మృతుల్లో 14 నుంచి 15 ఏండ్ల వయసున్న ఓ మైనర్‌తోపాటు 20 ఏండ్లకుపైగా వయసున్న 13 మంది వయోజనులు ఉన్నట్టు ప్రాథమిక వార్తలు స్పష్టం చేస్తున్నాయి. వీరిలో 8 మంది మహిళలు, ఐదుగురు పురుషులు గత నెల 15-31 మధ్యనే మరణించినట్టు తెలుస్తున్నది. అందుకు కారణాలేమిటో ఇంకా తెలియరాలేదు. కానీ, నిరుటి కంటే ఈ ఏడాది ఆశా కిరణ్ షెల్టర్ హోమ్‌లో మరణాల సంఖ్య చాలా పెరిగిందని, పోస్టుమార్టం నివేదికలు వచ్చాకే ఆ మరణాలకు కారణమేంటో వెల్లడవుతుందని ఎస్డీఎం తెలిపారు. దీంతో ఆ షెల్టర్ హోమ్‌లోని వారికి సరఫరా చేస్తున్న తాగునీటి నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో జాతీయ మహిళా కమిషన్ (ఎన్సీడబ్ల్యూ) స్పందించింది.
ఆశా కిరణ్ షెల్టర్ హోమ్‌లో అనుమానాస్పద మరణాలపై ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని ఎన్సీడబ్ల్యూ చైర్పర్సన్ రేఖా శర్మ ధ్వజమెత్తారు. ఆ మరణాలకు ఢిల్లీ మంత్రి ఆతిశీ బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ.. ఆశా కిరణ్ షెల్టర్ హోమ్‌కు నిజనిర్ధారణ బృందాన్ని పంపినట్టు ప్రకటించారు. ఢిల్లీ ప్రభుత్వం నడుపుతున్న నైట్ షెల్టర్ హోమ్‌లపై కూడా ఎన్సీడబ్ల్యూ ఆడిట్ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. కాగా, ఆశా కిరణ్ షెల్టర్ హోమ్‌లో జరిగినట్టుగా చెప్తున్న మరణాల సంఖ్యతో ఆతిశీ విభేదించారు. ఈ ఏడాది జనవరి నుంచి 14 మరణాలు సంభవించినట్టు చెప్పారు. ఈ మరణాలపై మెజిస్టీరియల్ దర్యాప్తు చేపట్టి 48 గంటల్లోగా నివేదిక సమర్పించాలని ఢిల్లీ రెవెన్యూ శాఖ అదనపు చీఫ్ సెక్రటరీని ఆదేశించారు. మున్ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆమె కోరారు.