ప్రయాగ్‌రాజ్: కుంభమేళాలో అపశృతి(Maha Kumbh Stampede) చోటుచేసుకున్నది. మౌనా అమావాస్య సందర్భంగా అమృత స్నానంలో పాల్గొనేందుకు లక్షల సంఖ్యలో భక్తులు త్రివేణి సంగమంకు చేరుకున్నారు. అయితే ఇవాళ తెల్లవారుజామున 3 గంటల సమయంలో అక్కడ తొక్కిసలాట జరిగింది. ఆ తొక్కిసలాటలో 14 మంది మృతిచెందారు. మరో 50 మందికిపైగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రయాగ్‌రాజ్‌లోని స్వరూపరాణి ఆస్పత్రికి మృతదేహాలను తరలించారు. అక్కడ పోస్టు మార్టం నిర్వహించనున్నారు.
మహాకుంభ్ పరిస్థితిపై ప్రధాని మోదీ.. యూపీ సీఎం యోగితో ఇవాళ మాట్లాడారు. ఇప్పటికే మూడు సార్లు మాట్లాడిన అక్కడి పరిస్థితులను తెలుసుకున్నారు. కుంభమేళా పరిస్థితి పై ప్రధాని మోదీ సమీక్షిస్తూనే ఉన్నారు. తక్షణమే సహాయక చర్యలు చేపట్టాలని ప్రధాని ఆదేశించారు. యూపీ ప్రభుత్వ అధికారులతో ఆయన టచ్‌లోనే ఉన్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు చేపట్టాల్సిన చర్యల్ని ఆయన సూచిస్తున్నారు.
తొక్కిసలాట వల్ల 13 అకాడాలు అమృత స్నానం రద్దు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్లు ప్రకటన జారీ చేశారు. అయితే ఇవాళ ఉదయం 10 గంటల తర్వాత అకాడాలు అమృత స్నానానికి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కూడా యూపీ సీఎంతో పరిస్థితి గురించి తెలుసుకున్నారు.
త్రివేణి సంగమంలో తొక్కిసలాట జరిగిన ప్రదేశానికి ఉదయం సుమారు 70 అంబులెన్సులు చేరుకున్నాయి. దాదాపు మూడు గంటల పాటు తరలింపు ప్రక్రియ జరిగింది. అమావాస్య రోజున స్నానం చేయాలన్న ఉద్దేశంతో.. కోట్ల సంఖ్యలో భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు చేరుకున్నారు. అధికారులు అంచనా ప్రకారం.. ఇప్పటికే 5 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్ పరిసరాల్లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు సాయంత్రం వరకు ఆ సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నాయి.