ముంబై : ముంబై తీర సమీపంలో బుధవారం ఓ ఫెర్రీపైకి నేవీ పడవ దూసుకెళ్లిన ఘటనలో 13 మంది మరణించారు. 99 మందిని కాపాడినట్లు భారతీయ నేవీ తెలిపింది. సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఇంజిన్ పరీక్షలు నిర్వహిస్తున్న క్రమంలో నేవీకి చెందిన ఓ పడవ ముంబై తీర సమీపంలోని కరంజా వద్ద సముద్రంలో ప్రయాణికులతో వెళుతున్న నీల్ కమల్ అనే ఫెర్రీని ఢీకొంది. ఇందులో ప్రయాణిస్తున్న పర్యాటకులు గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ప్రముఖ పర్యాటక ప్రదేశం ఎలిఫెంటా ద్వీపానికి వెళుతున్నారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే కోస్ట్ గార్డ్, మెరైన్ పోలీసులు వెంటనే రంగంలో దిగారు. 99 మందిని కాపాడినట్టు నేవీ ఒక ప్రకటనలో తెలిపింది. మరణించిన 13 మందిలో ఒక నేవీ ఉద్యోగి, ఇద్దరు ప్రైవేట్ సిబ్బంది ఉన్నారు.