పాట్నా: బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకున్నారు. సోమవారం ప్రవేశపెట్టిన విశ్వాస తీర్మానానికి 129 మంది ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఇందులో ముగ్గురు ఆర్జేడీ ఎమ్మెల్యేలు ఉండటం గమనార్హం. విపక్ష సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. మొత్తం 243 సభ్యులున్న బీహార్ అసెంబ్లీలో మెజార్టీ మార్క్ 122. అంతకుముందు ఆర్జేడీకి చెందిన అసెంబ్లీ స్పీకర్ అవధ్ బీహారి చౌదరీని తొలగించేందుకు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. 125-112 ఓట్లతో తీర్మానం నెగ్గింది. విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ, ‘నితీశ్ ఎన్డీయే కూటమిలో చేరడానికి కారణాలు ఏంటన్నది బీహార్ ప్రజలకు వివరించాలి’ అని అన్నారు. ఆ తర్వాత సీఎం నితీశ్ కుమార్ మాట్లాడుతూ, గతంలో ఆర్జేడీ ప్రభుత్వం రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడిందని, లాలూ సీఎంగా ఉండగా రాష్ట్రంలో మత కల్లోలాలు జరిగాయని ఆరోపించారు.