Modi Govt Failures | 12 ఏండ్లు.. 144 నెలలు.. 4,383 రోజులు.. కేంద్రంలో అధికార పగ్గాలు చేపట్టి ఎన్డీయే సర్కార్‌కు నేటికి పుష్కర కాలం. అయితే, ఈ కాలంలో దేశ ప్రజల బతుకులు వేదనాభరితంగా మారాయి. సామాన్యులను నిరాశావాదం ముంచెత్తింది. ఒక్కమాటలో చెప్పాలంటే పేద, మధ్యతరగతి జీవుల బతుకులు.. ‘కొందామంటే కొనలేం.. ఉందామంటే ఉండలేం.. మొత్తంగా బతుకలేం!’ అన్నట్టుగా తయారయ్యాయి. ‘అచ్ఛేదిన్’ తెస్తామంటూ 2014లో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్.. ప్రజలకు సచ్చేదినాలను చూయిస్తున్నది. ధరల పెరుగుదల, అప్పులు, రూపాయి క్షీణత, ఉగ్రదాడులతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. నిరుద్యోగం, పేపర్ లీకులతో యువ శక్తి నిర్వీర్యమౌతున్నది. పన్నెండేండ్ల పాలనలో ప్రజాసంక్షేమం అటుంచితే.. అనాలోచిత నిర్ణయాలతో ప్రజలను నిలువునా ముంచింది.
పెరిగిన ధరలు, పెట్రో మంటలు, పేపర్ లీకులు, రోడ్డుమీదికి నిరుద్యోగులు, పేదోళ్లకు అప్పుల తిప్పలు, సామాన్యులపై పన్నుల వాతలు, ఆడబిడ్డల ఆక్రందనలు, రైతన్నల బలవన్మరణాలు, రూపాయికి చిల్లు, దౌత్య వైఫల్యం ఫుల్లు, ఉగ్రదాడులు పైపైకి, ప్రగతి సూచీలు అధఃపాతాళానికి.. 12 ఏండ్ల ఎన్డీయే పాలన రికార్డులు ఇవి!!
ఎన్డీయే 12 ఏండ్లపాలనలో నిత్యావసరాల ధరలు 30 శాతం నుంచి 300 శాతం వరకూ పెరిగాయని లోకల్ సర్కిల్స్ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడించింది. బియ్యం, వంటనూనె, పప్పులు, గోధుమపిండి, చక్కెర, పాలు, చింతపండు తదితర నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

మొన్నటి వరకూ ఉల్లి కన్నీరు పెట్టించగా.. ఇప్పుడు టమోటా మోత మోగిస్తున్నది. కేంద్రం చమురు రేట్లను పెంచితే, దాని దెబ్బ వ్యవసాయ పెట్టుబడి, రవాణా వ్యవస్థపై పడి నిత్యావసరాల ధరల పెరుగుదలకు కారణమవుతున్నది. ఈ 12 ఏండ్లలో ముగ్గురు సభ్యులున్న ఓ కుటుంబం వారం భోజనం ఖర్చు రూ. వెయ్యి నుంచి రూ. 2 వేలకు పెరిగింది. ధరల పెరుగుదలతో పేద, మధ్యతరగతి ప్రజలు అప్పులపాలయ్యారు. పెరిగిన ఖర్చులతో రోజువారీ ఖర్చులను భరించలేకపోతున్నామంటూ 64 శాతం మంది ప్రజలు ‘ఇండియాటుడే-సీవోటర్’ నిర్వహించిన ఓ సర్వేలో వాపోయారు. ఒకవైపు చాలీచాలని జీతం.. మరోవైపు నిత్యావసరాల ధరలు పెరిగిపోవడంతో ప్రతినెలా కొత్తగా అప్పులు చేయాల్సి వస్తున్నదని ప్రతీ పది మందిలో ఏడుగురు ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ నివేదికను బట్టి అర్థమవుతున్నది.
12 ఏండ్లలో ఏం జరిగిందంటే?
నరేంద్ర మోదీ ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. 12 ఏండ్ల వ్యవధిలో లీటర్ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా 47.23 శాతం, 86.98 శాతం మేర పెరిగాయి.

2014లో లీటర్ పెట్రోల్ రూ. 78.5గా ఉంటే ప్రస్తుతం రూ. 115.58కు చేరింది. అప్పుడు లీటర్ డీజిల్ రూ. 55.48గా ఉంటే ఇప్పుడు రూ. 103.74కు పెరిగింది. పెట్రో ధరల పెంపుతో రవాణా చార్జీలు 30 శాతం మేర పెరిగినట్టు ట్రావెల్ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇక, బీజేపీపాలనలో గ్యాస్ సిలిండర్ ధరలు కూడా భారీగా పెరిగాయి. 14 కిలోల గృహ వినియోగదారుల సిలిండర్ 2014లో రూ. 414గా, 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రూ. 1,692గా ఉంటే ప్రస్తుతం వాటి ధరలు వరుసగా రూ. 965కు (పెరుగుదల 133.09%), రూ. 3,315కు (పెరుగుదల 95.92%) ఎగబాకాయి.

12 ఏండ్ల ఎన్డీయే సర్కార్ పాలనలో సామాన్యుడి జీతంలోని సింహభాగమంతా పన్నులకే పోతున్నట్టు అర్థమవుతున్నది. ఉదయం నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకూ మనం వినియోగించే ప్రతి వస్తువుకూ పన్ను కడుతున్నాం. 2014లో నరేంద్ర మోదీ తొలిసారిగా ప్రధానమంత్రి పగ్గాలు చేపట్టినప్పుడు కేంద్రానికి పన్నుల రూపంలో రూ. 17.94 లక్షల కోట్ల మేర ఆదాయం వస్తే, 2026నాటికి అది రూ. 50 లక్షల కోట్లు దాటింది.

అంటే గడిచిన 12 ఏండ్లలో పేద, మధ్యతరగతి ప్రజలపై ఎన్డీయే ప్రభుత్వం మూడింతల పన్నుపోటు పొడిచిందన్న మాట. ప్రధాని మోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకూ కేంద్రం ప్రజల నుంచి వసూలు చేసిన పన్నులు అక్షరాలా రూ. 329 లక్షల కోట్లుగా ఉన్నట్టు లెక్కలు చెప్తున్నాయి. 2014లో ఒక్కొక్కరి నెత్తిన సగటు పన్ను రూ. 12 వేలుగా ఉండగా.. 2026నాటికి అది రూ. 34 వేలకు చేరింది. అలా 12 ఏండ్లలో మొత్తంగా సగటున ఒక్కొక్కరి నెత్తిన పన్నుభారం రూ. 2.25 లక్షలను కేంద్రం మోపింది. కేంద్రం వసూలు చేసే పన్నుల్లో జీఎస్టీదే అగ్రతాంబూలం. జీఎస్టీ రూపంలో కేంద్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయం 9 ఏండ్లలో మూడు రెట్లు పెరిగిందని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు.
12 ఏండ్లలో ఏం జరిగిందంటే?
ఏటా రెండు కోట్ల చొప్పున ఉద్యోగాల భర్తీ చేపడుతామని అధికారంలోకి వచ్చిన ప్రధాని మోదీ.. నిరుద్యోగుల ఆశలపై నీళ్లుచల్లారు. దేశంలో నిరుద్యోగిత రేటు కనీవినీ ఎరుగని స్థాయికి చేరింది. యువతలో నిరుద్యోగిత రేటు 15 శాతానికి చేరినట్టు ఎంఓఎస్పీఐ తాజా రిపోర్టులో తేలింది. డిగ్రీ పూర్తైన 84 శాతం మందికి ఉద్యోగాలు లేవని, ఇంజినీరింగ్ పట్టభద్రుల్లో ప్రతి పది మందిలో 8 మందికి కొలువులు రావట్లేదని ‘అన్‌స్టాప్ టాలెంట్ రిపోర్ట్ 2026’లో వెల్లడైంది.

దేశంలో చదువుకు తగిన ఉద్యోగం చేస్తున్న పట్టభద్రులు కేవలం 8.25 శాతం మంది మాత్రమేనని హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ కాంపిటీటివ్నెస్ సంస్థ అధ్యయనంలో తేలింది. ఎన్నికలకు ముందు ప్రధాని మోదీ ఇచ్చిన మాటప్రకారం.. గడిచిన 12 ఏండ్లలో 24 కోట్ల ఉద్యోగ ఖాళీలను నింపాలి. అయితే, 7 లక్షల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ మాత్రమే జరిగినట్టు నివేదికలు చెప్తున్నాయి. దేశంలో ప్రజలు ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య ఏమిటని ఇండియాటుడే-సీవోటర్ సంస్థ ఇటీవల ఓ సర్వే నిర్వహిస్తే.. నిరుద్యోగమే తొలి సమస్య అని 24 శాతం మంది అభిప్రాయపడ్డారు. దేశంలో నిరుద్యోగం నిజంగానే తీవ్రమైన సమస్యగా మారిందంటూ 76 శాతం మంది అభిప్రాయపడ్డారు. ఉద్యోగం రాకపోవడంతో 2024 ఒక్క ఏడాదిలోనే 14,778 మంది (రోజుకు 40 మంది) నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకొన్నట్టు ఎన్సీఆర్బీ తాజా నివేదిక పేర్కొంది.
12 ఏండ్లలో ఇలా..
ఒకవైపు ఉద్యోగాలు దొరక్క యువశక్తి నిర్వీర్యమౌతుంటే, పేపర్ లీకేజీలు విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. ఇటీవల నీట్-యూజీ పేపర్ లీకేజీ, పరీక్ష రద్దు ఉదంతం యావత్తు దేశాన్ని విస్మయానికి గురి చేసింది. 12 ఏండ్ల బీజేపీ పాలనలో పేపర్ లీకేజీలు నిత్యకృత్యంగా మారాయని, డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ర్టాలు పేపర్ లీకేజీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ మేరకు కొన్ని ఉదాహరణలు కూడా చెప్తున్నారు.

నీట్-యూజీ పరీక్షలో అవకతవకలు జరుగడం 2024లో దేశవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టించింది. ఈ కేసు సుప్రీంకోర్టు వరకూ వెళ్లింది. ఇక, 2021లో జేఈఈ మెయిన్ పేపర్ హ్యాకింగ్‌కు గురవ్వడం, అదే ఏడాది రాజస్థాన్‌లో నీట్ పేపర్ లీకవ్వడం కలకలం సృష్టించింది. ఇక మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో 9 ఏండ్ల వ్యవధిలోనే 13 పరీక్ష పేపర్లు లీక్ అవ్వగా, హర్యానాలో బీజేపీ పాలనలో మొత్తం 28 పేపర్లు లీకయ్యాయి. బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలోని యూపీలో మూడేండ్ల వ్యవధిలోనే ఆరు పేపర్లు లీకవ్వగా.. రాజస్థాన్, మధ్యప్రదేశ్‌లోనూ పదుల సంఖ్యలో పేపర్ లీకేజీ ఘటనలు వెలుగుచూశాయి. ఇక, బీజేపీ ప్రభుత్వం ఉన్న అస్సాంలో రూ. 100కే పదో తరగతి పేపర్‌ను అంగడి సరుకుగా అమ్మకానికి పెట్టడం, ఈ విషయాన్ని అసెంబ్లీలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ స్వయంగా ఒప్పుకోవడం ఇప్పటికీ సంచలనమే.
దేశంలోని ఒక్కొక్కరి నెత్తిపై రూ. 1.48 లక్షల అప్పు ఉంది. కిందటి ఏడాది వరకూ కేంద్రంలోని ఎన్డీయే సర్కార్ రూ. 191 లక్షల కోట్లను అప్పు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మరో రూ. 17.2 లక్షల కోట్లను కొత్తగా అప్పు చేయనున్నట్టు బడ్జెట్ సందర్భంగా ప్రకటించింది. ఈ లెక్కన మొత్తం అప్పులు రూ. 208.2 లక్షల కోట్లు దాటనున్నది. అంటే, దేశ జనాభా 140 కోట్లుగా తీసుకొంటే, సెకనుకు ముందు పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముసలి వరకూ ప్రతీఒక్కరిపై రమారమి రూ. 1.48 లక్షల అప్పు ఉన్నట్టు లెక్క.

గత 67 ఏండ్లలో కేంద్రం చేసిన అప్పు రూ. 55,87,147 కోట్లు కాగా, నరేంద్రమోదీ ప్రధాని అయిన తర్వాత గడిచిన 12 ఏండ్లలో చేసిన అప్పు రూ. 1,52,85,363 కోట్లుగా ఉన్నది. అప్పటి ప్రధానులు ఏడాదికి సగటున రూ. 83 వేల కోట్లు అప్పులు చేస్తే, ప్రస్తుత ప్రధాని నెలకే రూ. 1.10 లక్షల కోట్ల అప్పు చేస్తున్నారు. ఈ ఏడాది మిత్తీలకే రూ. 14,03,972 కోట్లను చెల్లించాల్సి వస్తున్నది. అంటే నెలకు చెల్లించాల్సిన మిత్తి రూ. 1.17 లక్షల కోట్లుగా ఉన్నది.

మోదీ హయాంలో భారత ఆర్థిక వ్యవస్థకు ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. ఎన్డీయే ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో దేశ ఆర్థికం కోలుకోలేని విధంగా దెబ్బ తింటున్నది. అమెరికా డాలర్ ముందు దేశీయ కరెన్సీ విలువ రోజురోజుకూ దిగజారిపోతున్నది. చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠాలకు మన కరెన్సీ పతనమవుతున్నది.
2014లో డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ. 58.66గా నమోదవ్వగా.. ఇటీవల 96.95ను తాకింది. అంటే 12 ఏండ్లలో డాలర్‌తో రూపాయి కోల్పోయిన విలువ 65.27 శాతం మేర క్షీణించింది. దేశం నుంచి విదేశాలకు వెళ్లే వస్తూత్పత్తుల (ఎగుమతులు) కంటే విదేశాల నుంచి దేశంలోకి వస్తున్న వస్తూత్పత్తులే (దిగుమతులు) ఎక్కువగా ఉంటుండటంతో వాణిజ్య లోటు పెరిగిపోతున్నది. అంతేగాక దేశంలోని ఫారెక్స్ నిల్వలు (విదేశీ మారకం లేదా డాలర్లు) తరిగిపోతున్నాయి. ముఖ్యంగా అమెరికా-ఇరాన్ వార్ మొదలైన దగ్గర్నుంచి వేగంగా క్షీణిస్తున్నాయి. యుద్ధం మొదలవకముందు 728.494 బిలియన్ డాలర్లుగా ఉన్న ఫారెక్స్ నిల్వలు.. ఇప్పుడు 688.894 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. దాదాపు గడిచిన 3 నెలల కాలంలో 39.6 బిలియన్ డాలర్లు హరించుకుపోయాయి.

ఎక్కడైతే మహిళలు గౌరవించబడతారో అక్కడ దేవతలు విహరిస్తారని అంటారు. అయితే, బీజేపీ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఎన్సీఆర్బీ తాజా గణాంకాల ప్రకారం.. 2024 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4,41,534 మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి.

మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు టాప్-3 స్థానాల్లో ఉండటం గమనార్హం. 66,396 కేసులతో ఉత్తరప్రదేశ్ అగ్రస్థానంలో ఉండగా, 47,954 కేసులతో మహారాష్ట్ర రెండో స్థానంలో, 36,536 కేసులతో రాజస్థాన్ మూడో స్థానంలో నిలిచింది. మహిళలపై నేరాల్లో హత్యలు, లైంగిక దాడులు, లైంగిక వేధింపులు, కిడ్నాప్‌లు, గృహహింస, వరకట్న వేధింపులు తదితరాలు ప్రధానంగా ఉన్నాయి. ఇక చిన్నారులపై జరుగుతున్న నేరాలు కూడా అంతకంతకూ పెరుగుతున్నాయి. ఒక్క ఏడాదిలోనే 1.87 లక్షల మంది పిల్లలపై దారుణాలు జరిగాయి. 2023తో పోలిస్తే 2024లో పిల్లలపై నేరాలు 5.9 శాతం మేర పెరిగాయని నివేదిక వెల్లడించింది.
2024లో నేరాలూ-ఘోరాలు ఇలా
గడిచిన 12 ఏండ్లలో ప్రధాని మోదీ విదేశాంగ విధానంలో, దౌత్య సంబంధాలను నెరపడంలో విఫలమయ్యారు. భారత్‌కు పొరుగున ఉన్న శ్రీలంక, బంగ్లాదేశ్, మాల్దీవులు, భూటాన్ వంటి దేశాలూ మనకు వ్యతిరేకంగా మారి చైనాకు అనుకూలంగా మారడమే ఇందుకు రుజువు. ఇక, పహల్గాం ఉగ్రదాడికి కారణమైన పాక్‌ను అంతర్జాతీయ సమాజం ముందు దోషిగా నిలబెట్టడంలోనూ, అమెరికా ప్రతీకార సుంకాలు, భారతీయ విద్యార్థులపై ఆంక్షలను తప్పించడంలోనూ ఎన్డీయే సర్కారు చేతులెత్తేసింది. ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి గడిచిన 12 ఏండ్లలో 99 విదేశీ పర్యటనలు చేసిన మోదీ మొత్తంగా 79 దేశాలను చుట్టి వచ్చారు. విదేశీ పర్యటనలకు వెళ్లడం.. ఫొటోలు దిగడం.. తిరిగి రావడం తప్ప.. మోదీకి దౌత్య విజయాలేమీ లేవని ఎద్దేవా చేస్తున్నారు.
ఆర్థిక, సామాజిక, విద్య, వైద్యం, పారిశ్రామిక తదితర రంగాల్లో.. ద్రవ్యోల్బణం, నిరుద్యోగిత, ఉత్పాదకత, పౌర స్వేచ్ఛ, లింగ సమానత్వం, పత్రికాస్వేచ్ఛ, పాస్‌పోర్ట్, భద్రత వంటి 50కి పైగా సూచీల్లో మోదీ హయాంలో ఇండియా అట్టడుగు స్థానంలో నిలిచినట్టు ఆయా నివేదికలు ఇచ్చిన ర్యాంకులను బట్టి అర్థమవుతున్నది. ఆకలి సూచీలో సూడాన్, రువాండా, కాంగో వంటి అతి పేద దేశాలకంటే అట్టడుగు స్థానంలో భారత్ నిలిచింది. ప్రజాస్వామ్య సూచీలో 46వ ర్యాంకుకు దిగజారింది. హెల్త్ అండ్ సర్వైవల్ ఇండెక్స్‌లో 2014లో 114వ స్థానంలో ఉండగా, ప్రస్తుతం 143వ ర్యాంకుకు పడిపోయింది. ఆనందమయ దేశాలలో 116వ ర్యాంకుకు పతనమైంది. పింఛన్ సూచీలోనూ అట్టడుగున నిలిచింది. ఇటీవల విడుదల చేసిన హెన్లీ పాస్‌పోర్ట్ సూచీలో మూడు స్థానాలు కోల్పోయి 78వ ర్యాంకులో నిలిచిన భారత్.. పత్రికా స్వేచ్ఛలోనూ 151వ స్థానం నుంచి 157వ ర్యాంకుకు పడిపోయింది.
గడిచిన 12 ఏండ్ల కాలంలో దేశంలో ఉగ్రదాడి ఘటనలు పెరిగిపోయాయి. 2014లో మోదీ నేతృత్వంలో బీజేపీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గడిచిన 12 ఏండ్లలో దేశంలో 68 ఉగ్రదాడులు జరిగాయి. ఈ ఘటనలో 360 మంది వరకూ సైనికులు, పోలీసులు అమరులవ్వగా, 230 మంది పౌరులు మృతి చెందారు. 2014 నుంచి ఇప్పటివరకూ ఒక్క జమ్ముకశ్మీర్‌లోనే 11 ఉగ్రదాడి ఘటనలు జరిగాయి. 2016లో జరిగిన ఉరి ఉగ్రదాడి, 2019లో జరిగిన పుల్వామా దాడి, నిరుడు జరిగిన పహల్గాం ఉగ్రదాడి, ఎర్రకోట దగ్గర కారు పేలుడుతో యావత్తు దేశం వణికిపోయింది.
ప్రభుత్వం నుంచి ఆసరా లేకపోవడం.. అప్పుల బాధలు తాళలేక దేశంలో గంటకు ఓ రైతన్న ప్రాణాలు తీసుకొంటున్నట్టు ఎన్సీఆర్బీ తాజా గణాంకాలను బట్టి తెలుస్తున్నది. 2024లో వ్యవసాయ రంగంలో పనిచేసే 10,546 మంది రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యకు పాల్పడ్డట్టు ఎన్సీఆర్బీ నివేదిక కుండబద్దలు కొట్టింది.

రైతు ఆత్మహత్యల్లో 36.26 శాతం వాటాతో బీజేపీపాలిత మహారాష్ట్ర తొలి స్థానంలో ఉండగా, 28.17 శాతం వాటాతో కాంగ్రెస్ పాలిత కర్ణాటక రెండో స్థానంలో నిలిచింది. దేశంలో వివిధ కారణాలతో 2024 ఒక్క ఏడాదిలోనే 1,70,746 మంది ఆత్మహత్యకు పాల్పడినట్టు నివేదిక వెల్లడించింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ కలహాలు, నిరుద్యోగం తదితర సమస్యలతోనే దేశంలో ఆత్మహత్యలు పెరిగినట్టు నివేదికను బట్టి తెలుస్తున్నది.
12 ఏండ్ల ఎన్డీయే పాలనలో దేశంలో ఆత్మహత్య చేసుకున్న ఆన్నదాతలు 1.42 లక్షల మంది
2024లో రైతన్నల బలవన్మరణం ఇలా..
ఏడాదికి: 10,546
నెలకు: 879
రోజుకు: 29
గంటకు: 1 (సగటున)