Nirbhaya | న్యూఢిల్లీ, డిసెంబర్ 16 : దేశాన్ని కుదిపేసిన భయంకరమైన నిర్భయ సామూహిక హత్యాచార ఘటన జరిగి 12 ఏండ్లు దాటుతున్నా, దేశంలో ఇప్పటికి పరిస్థితులు మారలేదని, ఈ దేశంలో ఆడబిడ్డలకు రక్షణ లేదని నిర్భయ తల్లి ఆశా దేవి ఆందోళన వ్యక్తం చేశారు. 16 డిసెంబర్ 2012న చోటుచేసుకున్న ఈ ఘటన దేశ ప్రజల్ని కలిచివేసింది. సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో నిర్భయ తల్లి ఆశాదేవి ప్రసంగించారు.
నిర్భయకు ముందునాటి పరిస్థితులే ఇప్పుడూ కొనసాగుతున్నాయని, కోల్కతాలోని ఆర్జీ కర్ హత్యాచార ఘటనే ఇందుకు ఉదాహరణగా ఆమె పేర్కొన్నారు. ఈ కేసులో వాస్తవం ఏమిటన్నదీ ఇప్పటికీ బయటకు రాలేదని అన్నారు. ‘నా కూతురు ఇప్పుడు లేదు. కానీ ఆమె చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తు ఉన్నాయి. మళ్లీ ఇలాంటి ఘటన జరగకుండా దోషులకు శిక్ష పడాలని నా కూతురు కోరుకుంది. అయితే నిర్భయ ఘటన జరిగి 12 ఏండ్లు అవుతున్నా.. ఈ దేశపు ఆడబిడ్డలకు రక్షణ లేదు’ అని అన్నారు.