జైపూర్: మనీ లాండరింగ్ కేసు పేరుతో ఐఐటీ జోధ్‌పూర్ అసిస్టెంట్ ప్రొఫెసర్‌ను(35) మోసగించిన సైబర్ నేరగాళ్లు ఆమెను 12 రోజుల పాటు డిజిటల్ అరెస్ట్ చేసి సుమారు రూ.12 లక్షలను దోచుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలి పేరుతో ముంబైకు డ్రగ్స్‌తో కూడిన పార్సిల్ వచ్చిందని.. అందులో చాలా పాస్‌పోర్ట్‌లు, క్రెడిట్ కార్డులు ఉన్నాయని బెదిరించిన నేరగాళ్లు ఆమెను తమ పర్యవేక్షణలో ఉండాలని.. లేదంటే అరెస్ట్ చేయక తప్పదని బెదిరించి ఈ మోసానికి పాల్పడ్డారు.
బాధితురాలికి ఈ నెల 1న వేర్వేరు ఫోన్ నెంబర్ల నుంచి ఈ బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో భయపడిన బాధితురాలు వారు చెప్పినట్టు చేస్తూ వచ్చారు. నేరగాళ్లు ఆమె ఫోన్లో కెమెరాను ఆన్‌లో ఉంచి ఆమెను నిరంతరం పర్యవేక్షించారు. ఫోన్ స్క్రీన్ షేర్ చేయించుకొని ఆమె ఫోన్‌ను నియంత్రణలోకి తీసుకొన్నారు. స్కైప్ యాప్ ద్వారా ఆమె ల్యాప్ట్యాప్నూ నియంత్రించారు.
దీంతో ఆమె ఎవరినీ సంప్రదించలేకపోయారు. పది రోజుల తర్వాత ఆమె బ్యాంక్ ఖాతా వివరాలు తీసుకొన్న నేరగాళ్లు మంగళవారం సుమారు రూ.12 లక్షలను చెక్ ద్వారా ఆర్టీజీఎస్ విధానంలో బదిలీ చేయించుకున్నారు. ఆ తర్వాత బాధితురాలి ఫోన్, ల్యాప్‌ట్యాప్‌పై తమ యాక్సెస్ తొలిగించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది.