న్యూఢిల్లీ: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(Sports Authority of India)లో సుమారు వెయ్యి పోస్టులు ఖాళీ ఉన్నట్లు కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ తెలిపారు. కేరళలోని అట్టింగల్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ ఎంపీ ఆదూరి ప్రకాశ్ అడిగిన ప్రశ్నకు ఇవాళ పార్లమెంట్లో మంత్రి మాండవీయ సమాధానం ఇచ్చారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో తీవ్రమైన నిధులు, సిబ్బంది కొరతున్నట్లు ఇటీవల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక పట్ల ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకుందని ఆయన ప్రశ్నించారు. కమిటీ చేసిన ప్రతిపాదనలను గమనించామని, శాయ్లో మొత్తం 1191 పోస్టులు ఖాళీ ఉన్నాయని, కొన్ని పోస్టులకు ఇప్పటికే రిక్రూట్మెంట్ జరుగుతోందన్నారు.
పార్లమెంటరీ స్థాయి సంఘం గత ఆగస్టులో క్రీడలకు చెందిన రిపోర్టును తయారు చేసింది. శాయ్లో ప్రస్తుతం 45 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నట్లు కాంగ్రెస్ ఎంపీ దిగ్విజయ సింగ్ అన్నారు. కొరతను తీర్చేందుకే కాంట్రాక్టు నియమాకాలు జరుగుతున్నాని, ఇది సంపూర్ణ పరిష్కారం కాదన్నారు. క్రీడలకు చెందిన పార్లమెంటరీ కమిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ హర్భజన్ సింగ్, బీజేపీ ఎంపీ సంబిత్ పాత్ర, బాన్సురీ స్వరాజ్ కూడా ఆ కమిటీలో ఉన్నారు. ఖాళీలను నింపేందుకు రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టాలని, రానున్న ఆరు నెలల్లో యాక్షన్ రిపోర్టును సమర్పించాలని క్రీడాశాఖను కోరారు. క్రీడల శాఖకు 3794 కోట్లు గత ఏడాది కేటాయించారని, దాంట్లో 830 కోట్లు శాయ్కి అప్పగించినట్లు తెలుస్తోంది.