చండీగఢ్, జనవరి 15: గత 51 రోజులుగా నిరవధిక నిరాహార దీక్షలో ఉన్న రైతు నేత జగ్జీత్ సింగ్ డల్లేవాల్కు సంఘీభావంగా, తమ డిమాండ్లను నెరవేర్చడంలో కేంద్రం అనుసరిస్తున్న ఉదాసీన వైఖరికి నిరసనగా 111 మంది రైతులు బుధవారం ఆమరణ నిరాహార దీక్షను ప్రారంభించారు.
పంజాబ్-హర్యానా సరిహద్దు ఖనౌరి వద్ద 70 ఏండ్ల డల్లేవాల్ చేస్తున్న దీక్షతో ఆయన ప్రాణాలకు ముప్పు ఏర్పడిందని, ఆయన ఆరోగ్యం రోజురోజుకు దిగజారుతున్నదని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నేతలు ఆరోపించారు. పంటల కనీస మద్దతు ధరకు చట్టబద్ధతతో పాటు పలు అంశాలపై తాము చేస్తున్న డిమాండ్లను ఆలకించడానికి కానీ, తమతో చర్చలు జరపడానికి కానీ కేంద్రం ఏమాత్రం ఆసక్తి చూపడం లేదని రైతు నేత అభిమన్యు కోహర్ విమర్శించారు.