జైపూర్: ఆపరేషన్ సింధూర్(Operation Sindoor) చేపట్టి నేటికి ఏడాది అవుతోంది. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దళాధిపతులు ఇవాళ మీడియాతో మాట్లాడారు. ఎయిర్ మార్షల్ అవదేశ్ కుమార్ భార్తి మాట్లాడుతూ మే 7వ తేదీన ఇండియా 9 ఉగ్ర క్యాంపులను టార్గెట్ చేసిందన్నారు. అయితే పాకిస్థాన్ సైనిక చర్యకు దిగడంతో ఆ దాడుల్ని మరింత విస్తరించినట్లు చెప్పారు. 9 ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన ఆధారాలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ ఆ ఆధారాలను పరిశీలించవచ్చు అని భార్తి అన్నారు. పాకిస్థాన్‌కు చెందిన 11 ఎయిర్‌ఫీల్డ్స్‌ను టార్గెట్ చేసినట్లు చెప్పారు. ఆ దేశానికి చెందిన 13 విమానాలను కూల్చినట్లు తెలిపారు. సుమారు 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ యుద్ధ విమానాన్ని కూడా కూల్చినట్లు ఆయన తెలిపారు. ఆ సంక్షోభ సమయంలో భారత్‌కు ఎటువంటి నష్టాన్ని పాక్ కలిగించలేకపోయిట్లు చెప్పారు.
లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్ మాట్లాడుతూ 9 ఉగ్ర క్యాంపుల్లో ఉన్న సుమారు 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు పేర్కన్నారు. ఆపరేషన్ సింధూర్‌లో పాకిస్థాన్‌కు చెందిన వందకుపైగా ఉగ్రవాదులు హతమైనట్లు చెప్పారు. పాకిస్థాన్ మిలిటరీ చాలా పెద్ద సంఖ్యలో తమ దివంగత సైనికులకు అవార్డులు అందజేసిందని, దీని ద్వారా ఆ దేశ మిలిటరీ చావుదెబ్బ తిన్నట్లు అర్థమవుతోందన్నారు. వైస్ అడ్మిరల్ ఏఎన్ ప్రమోద్ మాట్లాడుతూ భారతీయ నౌకాదళం తమ యుద్ధ నౌకలను మోహరించడం వల్ల.. పాకిస్థానీ నేవీ, ఎయిర్ ఫోర్స్ వెనుకడుగు వేసిందన్నారు. ఒకవేళ పాకిస్థాన్ మళ్లీ దూసుకొస్తే, దాన్ని తిప్పికొడుతామన్నారు.
ఆపరేషన్ సింధూర్ సమయంలో స్వదేశీ వ్యవస్థలన్నీ కీలక పాత్ర పోషించినట్లు అధికారులు చెప్పారు. బ్రహ్మోస్ మిస్సైల్స్, ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమస్, డ్రోన్లు, అత్యాధునిక నిఘా వ్యవస్థలు ఆపరేషన్ సింధూర్ సమయంలో నిర్ణయాత్మక పాత్ర పోషించాయి.