Diabetes | న్యూఢిల్లీ: రెడ్ మీట్‌ను తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ ముప్పు పెరుగుతుందని తాజా అధ్యయనంలో తేలింది. 20 దేశాల్లోని సుమారు 19 లక్షల మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్‌ను అలవాటుగా తినడం వల్ల టైప్-2 మధుమేహం ముప్పు 15 శాతం పెరిగే అవకాశం ఉంటుందని, 100 గ్రాముల అన్ప్రాసెస్డ్ మీట్‌ను తింటే 10 శాతం వరకు, 100 గ్రాముల పౌల్ట్రీ వల్ల 8 శాతం వరకు ముప్పు పెరుగుతుందని తెలిపింది. ఈ అధ్యయన నివేదికను ‘ది లాన్సెట్ డయాబెటిస్ అండ్ ఎండోక్రినాలజీ’ జర్నల్‌లో ప్రచురించారు.
అమెరికా, బ్రిటన్, బ్రెజిల్, మెక్సికో తదితర దేశాల పరిశోధకులు చెప్తున్నదాని ప్రకారం, ప్రపంచంలోని అనేక ప్రాంతాల్లో సిఫారసు చేసిన పరిమాణం కన్నా ఎక్కువగా మాంసాన్ని తినడానికి, టైప్-2 డయాబెటిస్ సహా అసాంక్రమిక వ్యాధులు రావడానికి సంబంధం ఉన్నట్లు నిర్ధారణ అయింది. పదేండ్లపాటు జరిగిన ఈ అధ్యయనంలో 19,66,444 మంది పాల్గొన్నారు. వీరిలో 1 లక్ష మందికిపైగా టైప్-2 మధుమేహం బారినపడ్డారు. రోజూ 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్ తినేవారు దానికి బదులుగా 100 గ్రాముల అన్ప్రాసెస్డ్ రెడ్ మీట్ తినడం వల్ల టైప్-2 డయాబెటిస్ సగటున 7 శాతం తగ్గినట్లు వెల్లడైంది. రోజూ 50 గ్రాముల ప్రాసెస్డ్ మీట్‌కు బదులుగా 100 గ్రాముల పౌల్ట్రీని తినడం వల్ల ఈ వ్యాధి ముప్పు 10 శాతం తగ్గింది.