చెన్నై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin) భారీ బహుమతి ప్రకటించారు. ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్‌లను డీకోడ్ చేసి సరిగా అర్థం చేసుకునే వారికి ఒక మిలియన్ అమెరికా డాలర్లు (సుమారు రూ. 8.5 కోట్లు) ఇస్తామని అన్నారు. ఆదివారం చెన్నైలో సింధూ నాగరికత శతాబ్ది ఉత్సవాల సదస్సును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్టాలిన్ మాట్లాడారు. ఒకప్పుడు ఎంతో ఉన్నతంగా విలసిల్లిన సింధూ నాగరికత లిపిని మనం ఇప్పటికీ స్పష్టంగా అర్థం చేసుకోలేకపోతున్నామని అన్నారు. ఈ చిక్కుముడిని పరిష్కరించడానికి చరిత్రకారులు, పండితులు, పరిశోధకులు నేటికీ కృషి చేస్తూనే ఉన్నారని తెలిపారు. ఈ ప్రయత్నాలను ప్రోత్సహించడానికి, ఇండస్ వ్యాలీ స్క్రిప్ట్‌ను డీకోడ్ చేసి ఈ చిక్కుముడిని పరిష్కరించే వ్యక్తులు లేదా సంస్థలకు మిలియన్ అమెరికా డాలర్ల నగదును బహుమతిగా ఇస్తామని ప్రకటించారు.
కాగా, సింధూ నాగరికత, తమిళనాడు మధ్య చాలా సంబంధాలున్నాయని సీఎం స్టాలిన్ తెలిపారు. సింధూ లోయలోని కళాఖండాలు, తమిళనాడులోని ప్రదేశాలు, కళల మధ్య పోలికలు ఉన్నాయని చెప్పారు. అద్భుతమైన ఈ సారూప్యతలను వెల్లడించే పరిశోధన ఫలితాలను కూడా ఆయన ఉదాహరించారు.
మరోవైపు అత్యంత పురాతన పట్టణ సమాజాలలో సింధూ లోయ నాగరికత ఒకటి. అధునాతన పట్టణ ప్రణాళిక, కళలు, లిపికి ఇది ప్రసిద్ధి చెందింది. అయితే ఇండస్ వ్యాలీ లిపి నేటికీ పూర్తిగా అర్థం కాకుండా ఉంది. అలాగే ఈ అధునాతన నాగరికత క్షీణితకు సంబంధించిన రహస్యం కూడా చరిత్రకారులు, పరిశోధకులకు అంతుపట్టలేదు.