కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జాదవ్‌పూర్ యూనివర్సిటీలో (Jadavpur University) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థి సంఘం ఎన్నికల తేదీలను వెంటనే ప్రకటించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థుల నిరసన హింసాత్మకంగా మారింది. ఉపాధ్యాయ సంఘం కార్యాలయాన్ని వారు ముట్టడించి నిప్పంటించారు. దీంతో యూనివర్సిటీలో పరిస్థితులు అదుపుతప్పాయి.
కాగా, మార్చి 1న విద్యా శాఖ మంత్రి బ్రాత్య బసు, జాదవ్ యూనివర్సిటీని సందర్శించారు. విద్యార్థులు ఆయన వాహనాన్ని చుట్టుముట్టి దాడి చేశారు. కారు బానెట్‌ను ధ్వంసం చేశారు. దానిపై బ్రోకర్ అని రాశారు. వాహనంపైకి బూట్లు విసిరారు. విద్యార్థుల నిరసన నేపథ్యంలో మంత్రి బసు రెండు గంటలపాటు వాహనంలో చిక్కుకుపోయారు. పరిస్థితిని నియంత్రించేందుకు పోలీసులు ఇబ్బందిపడ్డారు.
మరోవైపు మంత్రి కాన్వాయ్ ముందుకు కదలడంతో ఇద్దరు విద్యార్థులు గాయపడ్డారు. దీంతో స్టూడెంట్స్ మరింత రెచ్చిపోయారు. మంత్రి బసు కారు విండోను ధ్వంసం చేశారు. దీంతో అద్దం పగలడంతో మంత్రి బసు ఎడమ చేతికి గాయమైంది. ఆయనను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. యూనివర్సిటీలో జరిగిన విధ్వంసకర సంఘటనలపై పోలీసులు ఏడు కేసులు నమోదు చేశారు. ఆదివారం ఒకరిని అరెస్ట్ చేశారు.
కాగా, విద్యార్థులను రక్షించడంలో యూనివర్సిటీ యాజమాన్యం విఫలమైందని స్టూడెంట్ సంఘాలు ఆరోపించాయి. విద్యా శాఖ మంత్రి బసు రాజీనామా చేయాలని డిమాండ్ చేశాయి. మార్చి 3న పెద్ద ఎత్తున నిరసనకు ఎస్ఎఫ్ఐ పిలుపునిచ్చింది. సోమవారం నుంచి ప్రారంభమయ్యే పరీక్షలకు ఎలాంటి విఘాతం కల్పించబోమని విద్యార్థి సంఘాలు తెలిపాయి. అయితే యూనివర్సిటీలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. భారీగా పోలీసులను మోహరించారు.