ముంబై : ఎన్సీబీ అధికారి సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ విమర్శల దాడి తీవ్రతరం చేశారు. కోట్లాది రూపాయల ముడుపులు దండుకునే సమీర్ వాంఖడే అత్యంత విలాసవంతమైన జీవితం గడుపుతారని ధ్వజమెత్తారు. వాంఖడే రూ 70,000 ఖరీదైన షర్ట్ ధరిస్తాడని, రూ లక్ష విలువైన ట్రౌజర్లు, రూ 25-50 లక్షల విలువైన వాచీలను వాడతారని ఆరోపించారు. ఆయన నిజాయితీ కలిగిన అధికారి అయితే ఇంత విలాసవంతమైన జీవితం ఎలా గడుపుతారని ప్రశ్నించారు.
పలువురిని కేసుల్లో ఇరికించి వాంఖడే రూ కోట్లు దండుకుంటారని అన్నారు. ఇలాంటి పనులు చేసేందుకు ఆయనకు ప్రైవేటు సైన్యం ఉందని చెప్పారు. గత పదిహేను రోజులుగా జేఎన్పీటీ వద్ద డ్రగ్స్‌తో కూడిన మూడు కంటైనర్లు ఉన్నా ఈ విషయంపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ ఎందుకు ఎలాంటి చర్యలూ చేపట్టలేదని ప్రశ్నించారు. తనకు అండర్‌వరల్డ్ ముఠాతో సంబంధాలున్నాయని మహారాష్ట్ర మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ చేసిన ఆరోపణలను నవాబ్ మాలిక్ తోసిపుచ్చారు. తనకు అండర్‌వరల్డ్ ముఠాతో సంబంధాలుంటే ఫడ్నవీస్ సీఎంగా ఉన్న సమయంలో తనపై ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు.