బెంగళూరు, జనవరి 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కర్ణాటకలోని బీజేపీ సర్కారుపై తుమకూరు కాంట్రాక్టర్ల సంఘం అధ్యక్షుడు బలరామయ్య తీవ్ర ఆరోపణలు చేశారు. రాజకీయ నేతల నుంచి గుమస్తా వరకూ అందరూ లంచాన్ని తీసుకోవడాన్ని హక్కుగా భావిస్తున్నారని, ప్రతి శాఖలోనూ అవినీతి పెచ్చరిల్లిందని ధ్వజమెత్తారు. కమీషన్ ఇస్తేనే బిల్లులు మంజూరు చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ శాసనసభ్యుల నియోజక వర్గాలకు మాత్రమే ఏటా 10-15 కోట్ల నిధుల్ని విడుదల చేస్తున్నారని, ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాలకు చిల్లిగవ్వ ఇవ్వడం లేదని విమర్శించారు. లంచాలు ఇచ్చిన వారికే కాంట్రాక్టులు, నిధులు ఇస్తున్నారని ఆరోపించారు. టెండరు ప్రక్రియలో పారదర్శకత కరువైందని దుయ్యబట్టారు. గుత్తేదార్ల సమస్యల పరిషారానికి, బిల్లుల మంజూరుకు రాజకీయ నేతలు, అధికారులు 40 శాతం కమీషన్ తీసుకుంటున్నారని ఆరోపించిన కర్ణాటక గుత్తేదార్ల సంఘం అధ్యక్షుడు కెంపణ్ణను అరెస్టు చేసినందుకు నిరసనగా ఈ నెల 10న బెంగళూరులోని స్వాతంత్య్ర ఉద్యానవనంలో ఆందోళన చేపట్టనున్నట్టు వెల్లడించారు.