చామరాజనగర్ (కర్ణాటక), అక్టోబర్ 23: ఆయన బీజేపీ మంత్రి.. ప్రజల ఓట్లతో గెలిచిన ఆయన వారి సమస్యలను పరిష్కరించాలి.. ఒకవేళ చేతగాకపోతే తన వల్ల కాదని చెప్పాలి.. అంతేగానీ చెయ్యి చేసుకొనే అధికారం ఉండదు. కానీ, ఓ మహిళపై చేయి చేసుకొన్నాడు. అందరు చూస్తుండగానే ఆమె చెంప చెల్లుమనిపించాడు. ఈ ఘటన బీజేపీ డబుల్ ఇంజిన్ పాలన సాగుతున్న కర్ణాటకలో చోటుచేసుకున్నది. శనివారం చామనగర జిల్లాలోని హంగ్లా గ్రామంలో గూడులేని పేదలకు ఇండ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జిల్లాకు ఇంచార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న గృహనిర్మాణ శాఖ మంత్రి వీ సోమన్న పట్టాలు అందజేయడానికి వచ్చారు. అయితే జాబితాలో పేరులేని ఓ మహిళ (వితంతువు) తనకు న్యాయం చేయాలని, ఇంటి పట్టా ఇప్పించాలని మంత్రిని కోరారు. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన మంత్రి సోమన్న ఆమె చెంపను చెల్లుమనిపించారు.
అయినా, తనకు గూడు లభిస్తే చాలనుకొన్న ఆ మహిళ.. మంత్రి కాళ్లు పట్టుకొని మరీ విజ్ఞప్తి చేసింది. కానీ మంత్రికి కనికరం కలుగలేదు. పైగా మంత్రి చుట్టూ ఉన్నవాళ్లంతా ఆ మహిళను పక్కకు ఈడ్చుకెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో సదరు మహిళ ఆదుకోవాలంటూ బోరున విలపించింది. ఈ సంఘటనను అక్కడే ఉన్న ఒకరు చిత్రీకరించి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. దీంతో ఆ వీడియో వైరలైంది. దీన్ని చూసిన పలువురు నెటిజన్లు మంత్రిపై తీవ్రంగా మండిపడ్డారు. మంత్రి అరాచకం ఏమిటని ప్రశ్నించారు. తరుచుగా భరతమాత పేరును ప్రస్తావించే బీజేపీ నాయకులకు ఈ మహిళలో భరతమాత కనిపించలేదా? అని నిలదీశారు. ఘటనపై కాంగ్రెస్ ఎంపీ జైరాం రమేశ్ స్పందించారు. ‘ఆయన అసలు మంత్రేనా? ఓ మహిళ పట్ల ఇలాగేనా ప్రవర్తించేది? వెంటనే మంత్రి పదవి నుంచి తొలగించాలి’ అని డిమాండ్ చేశారు. మరోవైపు ఘటనపై తీవ్ర విమర్శలు వస్తుండటంతో మంత్రి సోమన్న ఆదివారం స్పందించి, ఆ మహిళకు క్షమాపణలు చెప్పారు.