ముంబై, మార్చి 23: రాజకీయాలు, పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిన ఒక విద్యా సంస్థ బలవంతంగా తన విద్యార్థులను బీజేపీ ఆధ్వర్యంలో జరిగే సెమినార్‌కు పంపిన ఘటన ముంబైలో చోటుచేసుకుంది. కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కుమారుడు ధ్రువ్ గోయల్ ముంబై నార్త్‌లో పోటీ చేస్తున్నారు. ఆ నియోజకవర్గ పరిధిలోనే ఉన్న ఠాకూర్ కాలేజీ తన విద్యార్థులను ధ్రువ్ గోయల్ ఆధ్వర్యంలో జరిగే బీజేపీ సెమినార్‌కు బలవంతంగా పంపించింది. పరీక్షల వేళ తమ గుర్తింపు కార్డులను గుంజుకుని తమను ఈ సెమినార్‌కు పంపడం పట్ల పలువురు విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. ఏడో అంతస్తులో నిర్వహించిన ఈ సెమినార్ నుంచి బయటకు కూడా వెళ్లకుండా తమను అందులోనే ఉంచి లాక్ చేశారని వారు ఆరోపించారు. సెమినార్ అంతా ప్రధాన మంత్రి గొప్పతనం, బీజేపీ సాధించిన విజయాల గురించే సాగిందని వారు తెలిపారు. కాగా, శనివారం నుంచి విద్యార్థులకు పరీక్షలు ఉన్నమాటను అంగీకరించిన ప్రిన్సిపాల్, ఏ విద్యార్థిని కూడా ఫలానా పార్టీకి ఓటు వేయండని కోరలేదని చెప్పారు.