న్యూఢిల్లీ, మే 29 : నీట్ యూజీ-2026 పేపర్ లీక్ కేసుపై సుప్రీంకోర్టు శుక్రవారం కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇటువంటివి జరగడం చాలా బాధాకరమని సుప్రీంకోర్టు పేర్కొన్నది. నిజమైన జవాబుదారీతనం ఏర్పడే వరకు అసలు సమస్య ఆగదని స్పష్టం చేసింది. మనం మన యువతను నిరాశపరచకూడదని తెలిపింది. నీట్ పరీక్షల నిర్వహణ, ముగింపు ప్రక్రియను ప్రతి ఏటా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) ద్వారా సంస్థాగతం చేసే యంత్రాంగాన్ని రూపొందించే వివరాలను తెలియచేస్తూ ఒక ప్రత్యేక అఫిడవిట్‌ను దాఖలు చేయాలని కేంద్ర విద్యా శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది.
ప్రత్యేక సిబ్బందిని నియమించడం, విస్తృత శ్రేణి నిపుణులను కలిగి ఉండటం ద్వారా ఎన్టీఏలో సంస్థాగత నైపుణ్యాన్ని ఎలా అభివృద్ధి చేస్తారో అఫిడవిట్లో వివరించాలని జస్టిస్ పీఎస్ నరసింహ, జస్టిస్ అలోక్ అరాదేలతో కూడిన ధర్మాసనం పేర్కొన్నది. 2024, 2026 నీట్ పరీక్ష వివాదాల వంటి ఘటనలు పునరావృతం కాకుండా నిరోధించడానికి అవసరమైన భౌతిక, మేధోపరమైన సామర్థ్యాలను ఎన్టీఏ కలిగి ఉండేలా చూడటమే ప్రధాన ధ్యేయంగా ఉండాలని కోర్టు పేర్కొన్నది. ఆరు వారాల్లోగా అఫిడవిట్‌ను దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని కోర్టు ఆదేశించింది. విచారణ సందర్భంగా ఎన్టీఏ, ఉన్నత స్థాయి కమిటీ చైర్మన్ డాక్టర్ కే రాధాకృష్ణన్ దాఖలు చేసిన అఫిడవిట్లను కోర్టు పరిగణనలోకి తీసుకుంది.
పర్యవేక్షణ యంత్రాంగాలు, పర్యవేక్షక కమిటీలు ఉన్నప్పటికీ ఇంత పెద్ద ఉల్లంఘన ఎలా జరిగిందని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ)తో పోలుస్తూ దేశంలోని అత్యున్నత సివిల్ సర్వీసెస్ పరీక్ష అయిన యూపీఎస్సీలో ఇలాంటి సంఘటనలు ఎన్నడూ జరగలేదని కోర్టు వ్యాఖ్యానించింది. యూపీఎస్సీ వ్యవస్థల నుంచి గుణపాఠాలు నేర్చుకోవలసిన అవసరం ఉందని సూచించింది. ఇస్రో మాజీ చైర్మన్ రాధాకృష్ణన్ కమిటీ అఫిడవిట్‌ను న్యాయస్థానం పరిగణనలోకి తీసుకుంది.